వ్యాక్సిన్ పంపిణీకి 'ఆరోగ్యసేతు'

by  |
వ్యాక్సిన్ పంపిణీకి ఆరోగ్యసేతు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రస్తుతం హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ సంతృప్తికరంగా జరుగుతుండడంతో 50 ఏళ్ల వయసు పైబడినవారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఏ విధంగా ఇవ్వాలన్నదానిపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఒకటి రెండు వారాలలో వీటిని అన్ని రాష్ట్రాలకు పంపించనుంది. కరోనా వ్యాప్తి కోసం గతేడాది అమలులోకి తెచ్చిన ‘ఆరోగ్యసేతు’ మొబైల్ యాప్‌నే ఇప్పుడు వ్యాక్సిన్ పంపిణీకి కూడా వినియోగించాలనుకుంటోంది. ‘ఆరోగ్యసేతు’లోనే వ్యాక్సిన్ పొందాలనుకుంటున్నవారి వివరాలను నమోదు చేయడానికి అవసరమైన ఆప్షన్లను త్వరలో కల్పించనుంది. అదే సమయంలో ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్‌లో కూడా స్వచ్ఛందంగా పేర్లను నమోదు చేసుకోడానికి అవకాశం కల్పించాలనుకుంటోంది. త్వరలోనే ఈ రెండూ అందుబాటులోకి రానున్నాయి. పేర్లను స్వచ్ఛందంగా నమోదు చేయాలనుకుంటే తప్పనిసరిగా ‘ఆధార్’ కార్డు వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ‘ఆధార్’ కార్డు లేనట్లయితే ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుందని, అవి కూడా లేనట్లయితే మొబైల్ నెంబర్‌ను, ఫోటోను మాత్రం తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ‘ఆరోగ్యసేతు’ మొబైల్ యాప్ అయినా, ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్ అయినా చివరకు వ్యక్తుల డాటా వివరాలను క్రోడీకరించాల్సింది, భద్రపర్చాల్సింది కేంద్ర ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖేనని, ఈ వివరాలు కేవలం వ్యాక్సిన్ అవసరాల కోసమే తప్ప ఇతర అవసరాలకు వాడరాదన్న స్పష్టమైన విధానాన్ని కూడా రూపొందిస్తున్నట్లు ఆ వర్గాలు వివరించాయి.

‘ఆరోగ్యసేతు’ మొబైల్ యాప్‌లో పేర్లను నమోదు చేసుకున్నవారందరికీ వ్యాక్సిన్ కోసం ప్రత్యేకంగా ఒక ఐడీ నెంబరు జెనరేట్ అవుతుంది. ‘ఆరోగ్యసేతు’ యాప్‌ను ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేయాలనుకుంటోంది. యాప్‌లో నమోదైన వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ‘కొవిన్’లోకి వెళ్ళేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. లబ్ధిదారులు పేర్లను ఎందులో నమోదు చేసుకున్నా చివరకు వ్యాక్సిన్ కేంద్రాల్లో వైద్య సిబ్బంది ‘కొవిన్’లో నమోదైన వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నందున ఈ రెండింటి మధ్య రియల్ టైమ్ సమాచార మార్పిడి జరిగే వ్యవస్థ త్వరలో రూపుదిద్దుకోనుంది. ‘ఆరోగ్యసేతు’ యాప్‌లో ‘ఆధార్’ వివరాలను నమోదు చేయగానే ఆటోమేటిక్ వెరిఫికేషన్ తర్వాత ఒక ‘ఓటీపీ’ జెనరేట్ అవుతుందని, దాన్ని మళ్ళీ యాప్‌లో నమోదు చేయగానే ఐడీ నెంబర్ కేటాయింపు జరుగుతుందని సమాచారం. ‘ఆధార్’ లేనివారి విషయంలో మొబైల్ నెంబర్ ఆధారంగానే ‘ఓటీపీ’ జెనరేట్ అవుతుంది. దాని ప్రకారం ఐడీ నెంబర్ కూడా అలాట్ అవుతుంది. చివరకు ఐడీ నెంబర్ ఆధారంగానే వ్యాక్సిన్ కేంద్రంలో వైద్య సిబ్బంది టీకా ఇస్తారు.

త్వరలో మార్గదర్శకాలు

ప్రస్తుతానికి హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు పూర్తి ఉచితంగా సుమారు మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాతి క్రమంలో యాభై ఏళ్ల వయసు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వారియర్లలో లబ్ధిదారుల పేర్లను ఇప్పటికే ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్‌లో నమోదవుతూ ఉన్నందున మిగిలిన రెండు సెక్షన్ల ప్రజల వివరాలను సేకరించడంపైనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటివరకు స్పష్టత లేదు. కానీ ‘ఆరోగ్యసేతు’, ‘కొవిన్’ సాప్ట్‌వేర్‌లను ఇందుకు తగిన ప్లాట్‌ఫారంలుగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారు సైతం వ్యాక్సిన్ పొందడానికి ఇదే విధానాన్ని అవలంబించేలా ఆ మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఎన్నికల సంఘాన్ని ఇప్పటికే సంప్రదించిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని యాభై ఏళ్ల వయసుపైబడినవారి వివరాలను వినియోగించుకుంటామన్న ప్రతిపాదన పెట్టాయి. కేవలం వ్యాక్సిన్ అవసరాల కోసం మాత్రమే వాడుకోవాలని షరతు విధించి అనుమతి ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదుకాని యాభై ఏళ్ళు పైబడినవారి విషయంలో ఎలాంటి విధానాన్ని అవలంబించాలన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణ మాత్రం ఓటర్ల జాబితాతో పాటు ‘ఆసరా’ పింఛను లాంటి వివరాలను కూడా వ్యాక్సిన్ పంపిణీ కోసం వినియోగించుకోడానికి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాభై ఏళ్ళు దాటినవారికి పింఛను అందకపోవడంతో పూర్తి వివరాలు అందే అవకాశం లేదు.


Next Story