‘జ్వరంతో చిన్నారి మృతి.. రోగం గుర్తిస్తే మా బిడ్డ బతికేది’

by  |
‘జ్వరంతో చిన్నారి మృతి.. రోగం గుర్తిస్తే మా బిడ్డ బతికేది’
X

దిశ, అచ్చంపేట : డెంగ్యూ వ్యాధి తీవ్రం కావడంతో చిన్నారి ఇవ్వ స్వేచ్ఛ (7 ) హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాధవ పల్లి గ్రామానికి చెందిన చెవ్వ కళమ్మ, పాండు దంపతులు గత కొంతకాలంగా అచ్చంపేట పట్టణంలో నివసిస్తున్నారు. గత ఐదారు రోజుల క్రితం దంపతుల కూతురు చిన్నారి స్వేచ్ఛ కు జ్వరం రావడంతో స్థానికంగా అచ్చంపేట పట్టణంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించి చికిత్స అందించారని తెలిపారు.

ఈ సందర్భంగా వైద్యులు మలేరియా‌కు సంబంధించిన వైద్యం అందించారని, ఈ క్రమంలో కాస్త జ్వరం తగ్గి తిరిగి ఆదివారం ఉదయం విపరీతంగా జ్వరం వచ్చిందని తెలిపారు. స్థానికంగా అదే ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో ఆదివారం అర్ధరాత్రి హైదరాబాదులోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. నీలోఫర్ వైద్యులు చిన్నారిని పరిశీలించిన అనంతరం అప్పటికే బ్రెయిన్ పూర్తిగా పని చేయకపోవడం, పాపకు ఫిట్స్ రావడం తదితర కారణాల చేత కోమా‌లోకి వెళ్లిపోయిందని వైద్యులు తెలిపారన్నారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో బంధువులు పాపకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే క్రమంలో చిన్నారి స్వేచ్ఛ నిలోఫర్ ఆసుపత్రిలోనే మరణించినట్లు బంధువులు తెలిపారు.

వైద్యులు రోగాన్ని గుర్తుపడితే..

మా పాపకు డెంగ్యూ వ్యాధి సోకిందని వైద్యులు ముందుగానే గుర్తిస్తే… మా పాపను బతికించుకునే వాళ్ళమని పాప తల్లిదండ్రులు బంధువులు రోదిస్తున్నారు. స్థానికంగా డెంగ్యూ వ్యాధి నిర్ధారణకు సంబంధించి పరీక్షలు లేకపోవడం మూలంగానే పాప చనిపోయిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతిచెందిన చిన్నారి స్వేచ్ఛను నీలోఫర్ ఆసుపత్రి నుంచి స్వగ్రామానికి తరలిస్తున్నామని బంధువులు తెలిపారు.


Next Story

Most Viewed