Pahelgam Attack: సినిమా డైలాగులు కాదు మా ప్రశ్నలకు మోడీ జవాబు చెప్పాలి: కాంగ్రెస్

by Prasad Jukanti |

ప్రధాని నరేంద్ర మోడీ సినిమా డైలాగులు చెప్పడం కాదని మా ప్రశ్నలకుసమాధానాలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

Pahelgam Attack: సినిమా డైలాగులు కాదు మా ప్రశ్నలకు మోడీ జవాబు చెప్పాలి: కాంగ్రెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి (Pahelgam attack) ఘటన విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై (PM Modi) కాంగ్రెస్ పార్టీ మరోసారి విమర్శలు గుప్పించింది. పహెల్గాం ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా నెల రోజులు అవుతోందని 28 మంది ప్రాణాలు కోల్పోతే ఇప్పటి వరకు ప్రభుత్వం సమాధానాలు చెప్పడం లేదని నిలదీశింది. ఈ పాశవిక దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఎక్కడ అని ప్రశ్నించింది. ఆ ఉగ్రవాదులు దేశంలోనే ఉన్నారా? ఉంటే ఎక్కడ? లేదా బార్డర్ దాటి వెళ్లిపోయారా? అదే నిజం అయితే అలా ఎలా జరిగింది వీటికి మోడీ తప్పక సమాధానాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.

సినిమా డైలాగులు కాదు:

ఇవాళ రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పహెల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా డైలాగులు చెప్పడం కాదని మా ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. పహెల్గాం ఉగ్రవాదులు ఇంకా స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నారో చెప్పాలన్నారు. కొన్ని నివేదికల ప్రకారం గత 18 నెలల్లో పూంచ్, గగాంగిర్, గుల్మార్గ్ లో జరిగిన మూడు ఉగ్రదాడులకు పహెల్గాం దాడికి పాల్పడిన సంస్థే కారణం అని తెలుస్తోందన్నారు. ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష భేటీ ఎందుకు నిర్వహించలేదు? ట్రంప్ వ్యాఖ్యలపై ఎందుకు మోడీ మౌనంగా ఉన్నారు? ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు కోరితే ఎందుకు నిర్వహించట్లేదని ప్రశ్నించారు.

Next Story