ఓటీటీని షేక్ చేస్తున్న తెలంగాణ మహిళ ‘‘కిల్లర్ సూప్’’..

by Disha Web Desk 6 |
ఓటీటీని షేక్ చేస్తున్న తెలంగాణ మహిళ ‘‘కిల్లర్ సూప్’’..
X

దిశ, సినిమా: కరోనా వచ్చినప్పుడు లాక్ డౌన్ పడటంతో జనాలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే బందీలుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో చాలా మంది సినీ సెలబ్రిటీల సినిమాలు విడుదలైనా ఎవరూ చూడకపోవడంతో లాస్ వచ్చింది. ఇక ఈ సమయంలో ఓటీటీ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఎంత పెద్ద హీరో మూవీ అయినా ఓటీటీలో చూసే అవకాశం వచ్చింది. కరోనా వచ్చి పోయినా కానీ ఆ ఓటీటీ ట్రెండ్ అలాగే ఉండిపోయింది. దీంతో చాలా మంది థియేటర్స్‌కు పోకుండా ఓటీటీలోనే తమ అభిమాన హీరో సినిమా, పలు వెబ్‌సిరీస్‌లు ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ వల్ల ఎంతోమంది కొత్త కొత్త సినిమాలు చూస్తున్నారు. ప్రస్తుతం రియల్ స్టోరీలు వెబ్‌సిరీస్‌లుగా వచ్చి అందరినీ మెప్పిస్తున్నాయి.

అయితే ఇటీవల ఓ డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసినట్లు సమాచారం. తాజాగా, మరో డాక్యుమెంటరీ ఓటీటీని షేక్ చేస్తుంది. హర్షద్ నలవాడే, అనంత్ త్రిపాఠి, అభిషేక్ బాబే నిర్మించిన డాక్యుమెంటరీ కిల్లర్ సూప్. ఇది ఇటీవల ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. అంతేకాకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. అసలు ఈ స్టోరీ 2017లో తెలంగాణలో చోటుచేసుకున్న సంచలన ఘటన ఆధారంగా తెరకెక్కించారట. అసలు స్టోరీలోకి వెళితే.. తెలంగాణలోని నాగర్ కర్నూల్‌ జిల్లాలో ఓ మహిళ అక్రమ సంబంధం కోసం ఏకంగా భర్తనే చంపేసి మరీ ఆ స్థానంలో ప్రేమికుడిని తీసుకువచ్చి మ్యానేజ్ చేసిందట. నాగర్ కర్నూల్‌కు చెందిన స్వాతి, సుధాకర్ అనే ఇద్దరు దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే స్వాతి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భర్తను ఎలాగైనా చంపేసి ప్రియుడితో లైఫ్ ఎంజాయ్ చేయాలని కన్నింగ్ ప్లాన్ వేసింది. దీంతో భర్తకు కొద్ది కాలం పాటు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి అతడిని చంపాలనుకుంది. కానీ అవన్నీ ఫలించకపోవడంతో కోపంతో ఊగిపోయిన స్వాతి ప్రియుడిని పిలిపించి భర్త తలపై గట్టిగా కొట్టించింది. తీవ్రంగా గాయపడిన సుధాకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత స్వాతి ప్రియుడితో కలిసి భర్త మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో కాల్చి వేసింది. ఆ తర్వాత భర్తపై యాసిడ్ పడినట్లు అత్త, మామను నమ్మించి ప్రియుడికి కట్టుకట్టి ఇంటికి తీసుకువచ్చింది. అది నమ్మినవారు కొడుకు అలాంటి ప్రమాదం జరగిందని తెలిసి ఆందోళన చెందుతూ ఆ గాయం మానేందుకు పలు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే కొడుకు గాయం మానాలని సుధాకర్ కోలుకోవాలని అతని తల్లి మటన్ సూప్ తెచ్చి ఇచ్చిందట.

కానీ స్వాతి బాయ్‌ఫ్రెండ్ వెజిటేరియన్ కావడంతో తాగలేదు. దీంతో మృతుడు సుధాకర్ తల్లికి అనుమానం వచ్చింది. అదేంటి మటన్ సూప్ అంటే ఎంతో ఇష్టంగా తాగేవాడు ఇప్పుడు తాగడం లేదని అసలు అతను తన కొడుకా కాదా? అని అనుమానం పెంచుకుంది. ఇదే విషయాన్ని కోడలిని కూడా అడగడంతో స్వాతి నమ్మించే ప్రయత్నం చేసింది. అయినా కానీ సుధాకర్ తల్లి నమ్మకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం బయటపడింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి విచారించడంతో నిజాలు ఒప్పుకుంది. ప్రస్తుతం ఈ కథ ఆధారంగా తీసుకుని ఈ కిల్లర్ సూప్ డాక్యుమెంటరీ రూపొందించడంతో అందరినీ కట్టిపడేస్తుంది.

మరీ ముఖ్యంగా ప్రస్తుతం సమాజంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతుండటంతో అందరికీ కిల్లర్ సూప్‌పై ఆసక్తి పెరుగుతోందట. పెళ్లై పిల్లలు ఉన్న వివాహితలు, పురుషులు ఎంతో మంది మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని కన్నవారి తో పాటు, కడుపున పుట్టిన బిడ్డలను కూడా చంపుతున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం వార్తల్లో ఎన్నో వస్తున్నాయి. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ చాలా మందిలో మార్పు రావడం లేదు. ఇప్పుడున్న సమాజంలో పెళ్లి కంటే ఎక్కువగా వివాహేతర సంబంధానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. దీని వల్ల ఎన్నో కాపురాలు కూలిపోవడంతో పాటుగా కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

Next Story

Most Viewed