రిజర్వేషన్లపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. అంబేద్కర్ ప్రస్తావన తీసుకొచ్చి మరీ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 2 |
రిజర్వేషన్లపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. అంబేద్కర్ ప్రస్తావన తీసుకొచ్చి మరీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ నేతలు పదే పదే తమ ప్రసంగాల్లో కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్వయంగా ప్రధాని మోడీ స్పందించారు. శుక్రవారం ఆయన నారాయణపేట జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడుతూ.. దేశంలో హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. మత పరమైన రిజర్వేషన్లను ఆనాడు అంబేద్కర్ కూడా వ్యతిరేకించారని ప్రధాని గుర్తుచేశారు. కులాల పేరిట, మతాల పేరిట దేశాన్ని కాంగ్రెస్ విభజించిందని మండిపడ్డారు. దేశం గురించి కాంగ్రెస్‌కు ఏనాడూ పట్టింపులేదని.. రాజకీయ లబ్ది మాత్రమే పార్టీకి ముఖ్యం అని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే.. మతమార్పిడులు పెరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ ప్రాంతాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్‌ నేతలు తమ స్వార్థానికి వాడుకున్నారని మండిపడ్డారు.

ఈ ప్రాంతానికి కృష్ణా, తుంగభద్ర నదుల ఆశీర్వాదం ఉందని అన్నారు. మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు వేల కోట్లు ఇచ్చినా సద్వినియోగం కాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఉందని ఆవేదన చెందారు. ఇవేవీ కాంగ్రెస్‌ రాకుమారుడికి పట్టవని.. ఎన్నికలు రాగానే విద్వేష ప్రసంగాలు చేయడం మాత్రమే తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాకుమారుడి రాజగురువు మనల్ని రంగు ఆధారంగా విభజిస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. శరీర రంగును బట్టి దక్షిణ భారత్ వాళ్లు ఆఫ్రికన్లు అని మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు హిందువులు అంటే గిట్టదని అన్నారు. హిందువుల పండుగలు అంటే ఏమాత్రం వారికి నచ్చదని తెలిపారు. తాను గుడికి వెళితే కూడా దేశ వ్యతిరేకమైన పనిచేస్తున్నానని విమర్శలు చేస్తున్నారని ఆవేదన చెందారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed