పోలింగ్ శాతం మెరుగైంది.. హింస, సమస్యల్లేకుండా కంప్లీట్

by Disha Web Desk 2 |
పోలింగ్ శాతం మెరుగైంది.. హింస, సమస్యల్లేకుండా కంప్లీట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్‌సభ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగాయి. హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా, ఓటర్లు భయభ్రాంతులకు గురికాకుండా ప్రశాంతంగా జరగడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సంతోషం వ్యక్తం చేశారు. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పరిస్థితి కాస్త మెరుగుపడిందన్న సంతృప్తిని వ్యక్తం చేశారు. పోలింగ్ శాతం తగ్గకపోవచ్చని, సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత కూడా దాదాపు 1400 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలలో నిల్చుని ఉన్నారని, పోలింగ్ శాతంపై అర్ధరాత్రి దాటిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశముందన్నారు. పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓవరాల్ పోలింగ్ పర్సెంటేజ్‌పై ఇప్పుడే ఒక స్పష్టతకు రాలేమని, ప్రాసెస్ ముగిసిన తర్వాత స్క్రూటినీ జరగాల్సి ఉంటుందని, ఆ తర్వాతనే క్లారిటీ వస్తుందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రిటర్నింగ్ అధికారుల నుంచి అందిన సమాచారం మేరకు రీ పోలింగ్ జరగాల్సిన అవసరం రాకపోవచ్చని, స్క్రూటినీ చేసిన తర్వాత పరిస్థితిని విశ్లేషించి మంగళవారం నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంతో పోలిస్తే పోలింగ్ పర్సెంటేజీపై పార్టీలు, అభ్యర్థులతో పాటు ఎన్నికల సంఘానికి కూడా కొంత ఆందోళన ఉన్నదని, అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో పాటు ఉదయంనఉంచే పోలింగ్ కేంద్రాల దగ్గరకు ఓటర్లు రావడం చూసిన తర్వాత కాస్త నమ్మకం కలిగిందన్నారు. శాంతిభద్రతల రీత్యా కూడా ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అన్ని వైపుల నుంచీ సహకారం అందిందని, రాజకీయ పార్టీల నుంచి కూడా మంచి కోఆపరేషన్ లభించిందన్నారు.

పోలింగ్ సమయం సాయంత్రం ఆరు గంటలకే ముగిసినప్పటికీ చాలా మంది ఓటర్లు క్యూలలో నిల్చుండడంతో ఎంత ఆలస్యమైనా వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాల్సి ఉంటుందన్నారు. సాయంత్రం ఏడు గంటల తర్వాత ప్రాథమిక స్థాయిలో స్క్రూటినీ జరుగుతుందని, ఆ తర్వాతనే డాటా ఎంట్రీ ప్రాసెస్ మొదలవుతుందన్నారు. అర్థరాత్రి వరకు పోలింగ్ శాతం గంట గంటకో మారుతుందన్నారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాతనే నిర్దిష్టమైన డాటా ఎంట్రీతో సరైన పోలింగ్ శాతంపై స్పష్టత వస్తుందన్నారు. పోలింగ్ తర్వాత ఈవీఎంలన్నింటినీ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తున్నామని, వాటిని జీపీఎస్ సౌకర్యాన్ని కల్పించామన్నారు.

గతంతో పోలిస్తే ఈసారి రాజకీయ నాయకుల స్పీచ్‌లపై వచ్చిన ఫిర్యాదులు, నమోదైన ఎఫ్ఐఆర్‌ల సంఖ్య ఎక్కువగానే ఉన్నదని, భారీ స్థాయిలో (రూ. 330 కోట్ల విలువైన) నగదు, మద్యం, బంగారం, గిఫ్టుల్లాంటివి స్వాధీనం అయ్యాయన్నారు. పోలింగ్ రోజునే దాదాపు 400 మేర ఫిర్యాదులు వచ్చాయని, వీటిని పరిశీలించిన తర్వాత ఈసీకి రిపోర్టు పంపిస్తూ ఉన్నామన్నారు. ఇప్పటికే కొన్ని ఫిర్యాదులపై పోలీసులు వెంటనే స్పందించి 38 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారని తెలిపారు. తమకు అందిన ఫిర్యాదుల్లో దాదాపు సగం సీ-విజిల్ మొబైల్ అప్లికేషన్ ద్వారానే వచ్చాయని వివరించారు. అటు ఓటర్లు, ఇటు రాజకీయ పార్టీల నుంచి ఆశించిన సహకారం అందినందువల్లనే పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగిందన్నారు.

Next Story

Most Viewed