ఐపీఎల్‌కు వెళ్లొద్దు.. విదేశీ ప్లేయర్లకు జాన్సన్ సలహా!

by Phanindra |

ఐపీఎల్ మళ్లీ పునఃప్రారంభం అవనుంది. ఈ క్రమంలో మెగా లీగ్‌కు దూరంగా ఉండాలని విదేశీ ప్లేయర్లకు మిచెల్ జాన్సన్ సలహా ఇస్తున్నాడు.

ఐపీఎల్‌కు వెళ్లొద్దు.. విదేశీ ప్లేయర్లకు జాన్సన్ సలహా!
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2025 మళ్లీ మొదలవుతున్న నేపథ్యంలో ఈ మెగా లీగ్‌కు విదేశీ ప్లేయర్లు దూరంగా ఉండాలని ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ సలహా ఇచ్చాడు. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వారం రోజులు ఐపీఎల్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇదే అదనుగా కొందరు ఈ లీగ్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జాన్సన్ చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

‘ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయాలకు మద్దతుగా ఉంటామని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చెప్పడం మంచిదే. కానీ ఆ నిర్ణయం ఎంత ముఖ్యమైందో ప్లేయర్లే ఆలోచించుకోవాలి. క్రికెట్‌లో ఎంత డబ్బులు వచ్చినా అది జస్ట్ ఒక క్రీడ మాత్రమే అని ఆటగాళ్లు గుర్తుంచుకోవాలి. నేనైతే మిగతా మ్యాచులు ఆడటానికి కచ్చితంగా వెళ్లను. డబ్బు కన్నా ప్రాణం, భద్రత చాలా ముఖ్యం’ అని జాన్సన్ స్పష్టం చేశాడు. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఉన్న విషయాన్ని అతను గుర్తుచేశాడు.

‘ఐపీఎల్ రీషెడ్యూల్ అవడంతో ఫైనల్ జూన్ 3న జరగనుంది. అంటే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జస్ట్ వారం ముందే ఈ ఫైనల్ జరుగుతుంది. దీంట్లో ఆడితే అంత ముఖ్యమైన టెస్టు మ్యాచ్‌ కోసం ఆటగాళ్లు ఎలా సన్నద్ధం అవుతారు? ఇది కూడా ఆలోచించుకోవాలి’ అని జాన్సన్ సూచించాడు.

కాగా, వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ తిరిగి రావడం లేదని చెప్పేశాడు. మిచెల్ స్టార్క్ కూడా వచ్చేలా లేడు. ఈ క్రమంలో జాన్సన్ ఇస్తున్న సలహా ఇంకా ఎంతమంది విదేశీ ప్లేయర్లు వింటారో చూడాలి.

Next Story