IPL 2023: అతడు ఔటైతే ముంబైకి ఓటమే.. ఫ్యాన్స్ కామెంట్స్

by Disha Web Desk 13 |
IPL 2023: అతడు ఔటైతే ముంబైకి ఓటమే.. ఫ్యాన్స్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన లక్నో మ్యాచ్‌లో ముంబై 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి ఓవర్‌లో 11 పరుగులు చేయలేక ఓటమికి తలవంచింది. లక్నో బౌలర్ మోహ్‌సిన్ ఖాన్ సూపర్ బౌలింగ్‌తో గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచింది. దీంతో ముంబై ఇండియన్స్‌కు మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి రావడం, అచ్చొచ్చిన వాంఖడేలో చెలరేగడంతో వరుస విజయాలందుకుంది.

ఇప్పటి వరకు వాంఖడే వేదికగా 6 మ్యాచ్‌లు ఆడిన ముంబై నాలుగింటిలో గెలిచింది. రెండు మ్యాచ్‌లు కూడా ఆరంభంలోనే ఓటమిపాలైంది. ముంబై గెలిచిన నాలుగు మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడం గమనార్హం. వాంఖడే వేదికగా చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో సూర్య(1) విఫలమవడంతో ఓటమిపాలైంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 43 పరుగులతో ఫామ్ అందుకున్న సూర్య.. పంజాబ్ కింగ్స్‌పై 57, రాజస్థాన్ రాయల్స్‌పై 55, ఆర్‌సీబీపై 83, గుజరాత్ టైటాన్స్‌పై 103 పరుగులతో రాణించడంతో ముంబై విజయాలందుకుంది. సూర్య ఆడిన ప్రతీ మ్యాచ్‌లో గెలిచిన ముంబై.. ఒక్క పంజాబ్ చేతిలో మాత్రమే ఓటమిపాలైంది.

సూర్య విఫలమైన ప్రతీ మ్యాచ్‌లోనూ ముంబైకి ఓటమి తప్పలేదు. లక్నోతో జరిగిన తాజా మ్యాచ్‌లోనూ సూర్య 7 పరుగులకే వెనుదిరగడంతో ముంబై ఓటమిపాలైంది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లోనే సూర్య రాణించాడు. ఆర్‌సీబీతో బెంగళూరు వేదికగా సూర్య 15 పరుగులే చేయగా ముంబై ఓటమిపాలైంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ సూర్య 7 పరుగులే చేయగా.. సన్‌రైజర్స్ తప్పిదంతో గట్టెక్కింది. ఈ క్రమంలోనే సూర్య ఔటైతే ముంబైకి ఓటమేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే మే 21న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్ వాంఖడే వేదికగా జరగనుండటం ముంబైకి కలిసొచ్చే అంశం. ఈ మ్యాచ్‌లో సూర్య చెలరేగాలని ఆ జట్టు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Next Story

Most Viewed