హత్యకు దారితీసిన ఇన్‌స్టా రీల్స్.. భర్త ఎంత చెప్పినా భార్య వినలే..!

by Bhoopathi Nagaiah |

సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోన్న కాలం ఇది. కొత్త దుస్తులు కొన్నా.. కొత్తగా ఫుడ్ చేసినా.. చివరికి ఎదురింట్లో తుమ్మినా.. దగ్గినా సోషల్ మీడియాలో పెట్టి వ్యూస్, లైక్‌ల కోసం ఆరాటపడుతుంది నేటి యువత.

హత్యకు దారితీసిన ఇన్‌స్టా రీల్స్.. భర్త ఎంత చెప్పినా భార్య వినలే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోన్న కాలం ఇది. కొత్త దుస్తులు కొన్నా.. కొత్తగా ఫుడ్ చేసినా.. చివరికి ఎదురింట్లో తుమ్మినా.. దగ్గినా సోషల్ మీడియాలో పెట్టి వ్యూస్, లైక్‌ల కోసం ఆరాటపడుతుంది నేటి యువత. దీని వల్ల కొంత లాభం ఉన్నా.. నష్టమూ అంతకంటే ఎక్కువగానే ఉన్నది. ఓ ఇల్లాలు ఇన్ స్టా గ్రామ్ రీల్స్‌కు అలవాటు పడి ప్రాణాలనే పొగొట్టుకుంది. రీల్స్ చేయవద్దు.. చాటింగ్ చేయవద్దని భర్త ఎంత వారించినా పట్టించుకోకుండా హతమైంది. కోల్‌కతాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కోల్‌కతా నగరంలో పరిమళ్ బైద్య ఆయన భార్య అపర్ణ (35) నివాసం ఉంటున్నారు. భర్త తాపీ మేస్త్రిగా పని చేస్తున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే ఇంటి వద్దనే ఉండే అపర్ణ ఇన్ స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుంటుంది. దీంతో ఆమెకు వేలల్లో ఫాలోవర్స్ అయ్యారు. ఈ క్రమంలో వారిలో కొందరితో పరిచయాలై చాటింగ్ చేసేది. దాంట్లో పురుషులు కూడా ఉండటంతో ఆమె భర్త పరిమళ్ బైద్య హెచ్చరించాడు. ఇకపై రీల్స్ చేయవద్దని, మగాళ్లతో చాటింగ్ చేయవద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగి.. పుట్టింటికి కూడా వెళ్లి వచ్చేది.

అయితే భర్త ఎంత వారించినా అపర్ణ మాత్రం చాటింగ్స్ ఆపలేదు. ముఖ్యంగా ఓ రుణ మంజూరు సంస్థకు చెందిన ఉద్యోగితో నిత్యం చాటింగ్ చేయడంతోపాటు ఫోన్‌లో మాట్లాడుతుండేది. భార్య ప్రవర్తన పూర్తిగా మారిపోతుండటంతో పరిమళ్ బైద్యకు అనుమానాలు రేకెత్తాయి. తన భార్య ఇన్ స్టా ఫాలోవర్స్‌తో అక్రమ సంబంధం పెట్టుందని అనుమానం పెంచుకున్నాడు. ఇదే సమయంలో అపర్ణ శృతిమించి ప్రవర్తించడంతో భర్త సైకోలా మారిపోయాడు. ఇంట్లోనే ఆమె గొంతుకోసి హత్య చేసి పారిపోయాడు. సాయంత్రం వారి కుమారుడు ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చే సరికి తల్లి రక్తపు మడుగులో పడి ఉంది. ఆ దృశ్యాలను చూసిన బాలుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. హతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న పరిమళ్ బైద్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story