- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థి అనుమానస్పద మృతి.. అసలు నిన్న రాత్రి ఏం జరిగింది..?
సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి అకస్మత్తుగా అనుమానస్పదస్థితిలో అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దిశ, వెబ్డెస్క్ : సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి అకస్మత్తుగా అనుమానస్పదస్థితిలో అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలో ఉన్నబీసీ గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు, తోటి విద్యార్థుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల వెంకన్న- జయలక్ష్మీ దంపతుల కుమారుడు రాకేష్ (16) మహాత్మా జ్యోతిభా ఫూలే బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలలో 5వ, తరగతి నుంచి చదువుతున్నాడు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. హాస్టల్ లో ఉండే చదువుకుంటున్న రాజేశ్ బుధవారం రాత్రి వసతి గృహంలోని పాత మరుగుదొడ్ల వద్ద రేకుల షెడ్డుకు ఉరివేసుకున్న స్థితిలో చనిపోయి ఉన్నాడు. గురువారం తెల్లవారు జామున తోటి విద్యార్థులు చూసి హాస్టల్ వార్డన్కు సమాచారం ఇచ్చారు. అయితే రాకేశ్ మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఉరి వేసుకున్నా కాళ్లు నేల మీదనే ఉండటంతో ఇది ఆత్మహత్య కాదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
తోటి విద్యార్థులు చెబుతుంది ఇదే..
బుధవారం స్కూల్ వదిలిన అనంతరం కొంత మంది విద్యార్థులు గణేశ్ నిమజ్జనం సందర్భంగా గ్రామాల్లోకి వెళ్లి ఉత్సవాల దగ్గర డప్పులు కొట్టినట్లు చెబుతున్నారు. అయితే విద్యార్థులు హాస్టల్ వదిలి బయటకు వెళ్లి డప్పులు కొట్టడంపై ఆగ్రహం చెందిన ఓ లెక్చరర్ ఆ విద్యార్థులను తీవ్రంగా మందిలించినట్టు కొంతమంది విద్యార్థులు పేర్కొంటున్నారు. ఇంకొంత మంది మాత్రం హాస్టల్ గదుల్లో లెట్లు బంద్ చేసే విషయంలో వార్డన్ మందలించినట్టు చెబుతున్నారు. ఈ కారణాలతోనే రాకేశ్ మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. మృతుడి తల్లిదండ్రులు మాత్రం వార్డనే తన కొడుకును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.
PDSU, SFI, AISF నాయకులు వచ్చి హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులపై దుర్భాషలాడటం పైపులతో కొట్టడం లాంటి చర్యలకు పాల్పడ్డారు అని అన్నారు. పాఠశాలలో ఎంతో చురుకుగా ఉండే రాకేష్ మృతి పట్ల అనేక రకాల అనుమానాలు ఉన్నాయని రాకేష్ మృతి పై సమగ్ర విచారణ జరిపి బాధితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. రాకేష్ తండ్రి అంగవైకల్యం తో బాధపడుతున్నాడని నిరుపేద కుటుంబమని, వారి కుటుంబానికి Rs.50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. తరచూ బిసి గురుకులాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు నేల రాలిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాకేష్ మృతి పట్ల విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను శాంతిపజేశారు.
ఇంటి బాట పట్టిన విద్యార్థులు
కాగా, గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి చెందడంతో తోటి విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఈ హాస్టల్లో ఉండలేం అంటూ తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. దీంట్లో ఇప్పటికే కొంత మంది తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను తీసుకెళ్తున్నారు. నాలుగు రోజుల పాటు పాఠశాలకు అనాధికారికంగా సెలవులు ఇచ్చినట్లు సమాచారం.






