HYD: రౌడీషీటర్లకు చెక్​పెట్టేందుకు పోలీసుల సరికొత్త స్ర్టాటజీ

by Disha Web Desk 2 |
HYD: రౌడీషీటర్లకు చెక్​పెట్టేందుకు పోలీసుల సరికొత్త స్ర్టాటజీ
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ‘పెళ్లాం చెబితే వినాలి’.. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రౌడీషీటర్లకు చెక్​పెట్టటానికి హైదరాబాద్​పోలీసులు అమల్లోకి తీసుకొచ్చిన సరికొత్త వ్యూహమిది. ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చే వరకు తమ తమ భర్తలు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చూసుకోవాలంటూ రౌడీషీటర్ల భార్యలకు కౌన్సెలింగ్​ ఇస్తున్నారు. హైదరాబాద్​సీపీ సందీప్ శాండిల్య ఆదేశాలతో దీనికోసం ఏడుగురు మహిళా డీసీపీలు మహిళా సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. హైదరాబాద్​ కమిషనరేట్​ పరిధిలోని రౌడీషీటర్ల భార్యలను ఇప్పటికే కలిసి వారితో మాట్లాడారు. కొందరు ఎమ్మెల్యే అభ్యర్థుల వెంట రౌడీషీటర్లు తిరుగుతుండటాన్ని పోలీసు నిఘా వర్గాలు పసిగట్టాయి. వీరి కారణంగా శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నట్టుగా ఉన్నతాధికారులకు నివేదికలు అందించాయి. దీంతో పోలీసులు ఈ చర్యలు చేపడుతున్నారు.

కొత్వాల్​ స్ట్రాటజీ..

రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సీపీ సందీప్​శాండిల్య ఈ స్ర్టాటజీకి శ్రీకారం చుట్టారు. రౌడీషీటర్ల భార్యలకు కౌన్సెలింగ్​ ఇచ్చేందుకు సెంట్రల్​జోన్​లో డీసీపీ పుష్ప, ఈస్ట్​జోన్​లో మహిళా భద్రత విభాగం ఏసీపీ ప్రసన్న లక్ష్మి, ఉత్తర మండలంలో డీసీపీ చందనా దీప్తి, దక్షిణ మండలంలో సీసీఎస్​డీసీపీ శిల్పవల్లి, డీసీపీ సౌత్​వెస్ట్​జోన్​లో టాస్క్​ఫోర్స్​ డీసీపీ నితికాపంత్, సౌత్​ఈస్ట్​జోన్​ పరిధిలో మహిళా భద్రతా విభాగం డీసీపీ డీ.కవిత, వెస్ట్​జోన్​లో తెలంగాణ యాంటీ నార్కొటిక్​ బ్యూరో డీసీపీ డీ.సునీతారెడ్డికి బాధ్యతలు అప్పజెప్పారు.

పని పూర్తి కాగానే..

ఆయా జోన్ల బాధ్యతలు తీసుకున్న మహిళా అధికారులు మహిళా సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. ఉదయం 7 నుంచి 10గంటలు, సాయంత్రం 4నుంచి 7గంటల మధ్య అన్ని జోన్ల పరిధుల్లో కలిపి వంద మంది రౌడీషీటర్ల భార్యలు, కుటుంబ సభ్యులను కలిశారు. ఈ క్రమంలో కొందరు రౌడీషీటర్లు ఉద్యోగాలతోపాటు వేర్వేరు వృత్తుల్లో ఉన్నట్టుగా వెల్లడైంది. ఇలాంటి వారందరిని పని వేళలు పూర్తయ్యాకా బయటకు వెళ్లనివ్వద్దని తెలిపారు. రాజకీయ పార్టీల ర్యాలీలు, ప్రచారాలు, మీటింగులకు హాజరు కాకుండా చూసుకోవాలని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ చర్యలు ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed