భ్రష్టుపట్టిన కీలక విభాగాలు.. ప్రశాంత విశాఖలో పెరుగుతున్న హింసా సంస్కృతి

by Disha Web Desk 2 |
భ్రష్టుపట్టిన కీలక విభాగాలు.. ప్రశాంత విశాఖలో పెరుగుతున్న హింసా సంస్కృతి
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: గత ప్రభుత్వాలు విశాఖ రూరల్ మండల పరిధిలోని వందల ఎకరాలను మాజీ సైనికోద్యోగులకు, స్వాతంత్య్ర సమరయోధులకు వ్యవసాయం కోసం కేటాయించాయి. ఇప్పడు ఆ భూముల విలువ కోట్లలోకి వెళ్లిపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతలు తమ పలుకుబడితో వాటిని హస్తగతం చేసుకొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల రాజకీయ ప్రముఖులకు విశాఖ రూరల్ లో భూములు ఉన్నాయంటే ఇవి ఎలా చేతులు మారాయో ఊహించవచ్చు.

ఎన్ఓసీ జాప్యమే హత్యకు కారణమా?

ఇలాంటి భూములను గృహ అవసరాలకు వినియోగించేందుకు తహసీల్దార్ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) అవసరం. ఇటువంటి ఆమోదం పొందడంలో జాప్యం జరగడం, రమణయ్య బదిలీ అయిపోవడమే హత్యకు కారణమనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కన్వేయన్స్ డీడ్ వ్యవహారం హత్యకు కారణం కావచ్చని నగర పోలీసు కమీషనర్ రవిశంకర్ అయ్యన్నార్ చెప్పారు.

గతంలో లాలం సుధాకర్ పైనా..

ఇదే తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసి రిటైరైన విశాఖకే చెందిన లాలం సుధాకర్ గతంలో అనుమానాస్పద స్ధితిలో రోడ్ ప్రమాదానికి గురయ్యారు. ద్విచక్ర వాహనంపై పెద్దగా ట్రాఫిక్ కూడా లేని ప్రాంతంలో వెళుతున్న ఆయనను తెన్నేటి పార్క్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఆ ప్రమాదంలో తలకు బలమైన గాయం తగలడంతో మూడేళ్లుగా ఆయన మాట లేకుండా మంచానికే పరిమితమైపోయారు. ఇదీ హత్యాయత్నమే అనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. విశాఖ నగర పరిసరాల్లో ఇద్దరు వీఆర్వో లు హత్యకు గురయ్యారు. ఇంకా అనేక మందిపై దాడులు జరిగాయి. భూ వివాదాలే ఇందుకు కారణం.

భ్రష్టుపట్టిన కీలక విభాగాలు..

రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అత్యంత కీలకమైన పోలీసు, రెవెన్యూ విభాగాలు భ్రష్టుపట్టాయి. స్వయంగా విశాఖలో ఎంపీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ కు గురై 36 గంటలు వారి చెరలో ఉన్నా పోలీసులకు సమాచారమే లేదు. ఆ తరువాత ఈ వ్యవహారంలో కఠిన చర్యలూ లేవు. రెవెన్యూ అక్రమాలు, కబ్జాలపై ఫిర్యాదులు కలెక్టర్ వరకూ వస్తున్నా నేతల ఒత్తిడి కారణంగా స్పందించడం లేదు. తమ భూములు పెద్దల పరమయ్యాయంటూ ఎందరో అమాయకులు ఆత్మహత్యలకు పాల్పడినా అధికారులలో స్పందన లేకపోవడం విషాదకరం.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed