ముహుర్థం జనవరి 22నే ఎందుకు ?.. అందులోని విశిష్టత ఏమిటీ

by Ramesh Goud |

ఐదు శతాబ్దాల భారతీయుల కల మరికొన్ని రోజుల్లో నెరవేరబోతున్నది

ముహుర్థం జనవరి 22నే ఎందుకు ?.. అందులోని విశిష్టత ఏమిటీ
X

దిశ వెబ్ డెస్క్: ఐదు శతాబ్దాల భారతీయుల కల మరికొన్ని రోజుల్లో నెరవేరబోతున్నది. దశాబ్దాల పాటు కోర్టుల్లో సాగించిన పోరాటం ఎట్టకేలకు విజయవంతమైంది. దాని ఫలితమే రామాలయ నిర్మాణం. 2019లో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆలయ నిర్మాణ బాధ్యతల కోసం అయోధ్య శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ఏర్పాటైంది. దేశంలోని పౌరులను భాగస్వామ్యం చేస్తూ ఆలయ నిర్మాణం చేపట్టారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలోనూ ఆలయ నిర్మాణం పనులు చురుగ్గా కొనసాగాయి.

ఎన్ని విపత్తులెదురైనా వెయ్యేళ్లపాటు చెక్కుచెదరని విధంగా రామాలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయ నిర్మాణంలో ఎలాంటి కాంక్రీట్‌, ఇనుము ఉపయోగించలేదు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన గ్రానైట్‌ రాళ్లతో ఆలయం నిర్మించారు. సింహభాగం నిర్మాణం పనులు పూర్తయ్యాయి. భారతీయుల భావోద్వేగాలతో ముడిపడిన రామాలయం ప్రారంభోత్సవం జనవరి 22న జరగాలని పండితులు నిర్ణయించారు. అసలు రామాలయ ప్రారంభోత్సవానికి జనవరి 22నే ముహూర్తం నిర్ణయించడం వెనుక కారణం ఏంటో తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం శ్రీరాముడు త్రేతాయుగంలో అభిజిత్‌ ముహూర్తంలో మృగశిర నక్షత్రంలో జన్మించాడు. ఆ సమయంలో అమృతసిద్ది, సర్వాసిద్ది యోగం ఉండటం విశేషం. అంతటి పవిత్రమైన కాలం మరలా జనవరి 22న రావడంతో ఆ ముహూర్తాన్నే రామాలయం ప్రారంభోత్సవ ముహూర్తంగా నిర్ణయించారు. అభిజిత్ ముహూర్తమంటేనే శక్తివంతమైనది, పరమపవిత్రమైన ఘడియలుగా చెబుతారు. ఈ ముహూర్తం 48 నిమిషాలపాటు ఉంటుంది. ఈ ముహూర్తం జనవరి 22న మధ్యాహ్నం 12.16 గంటలకు ప్రారంభమై 12.59కి ముగుస్తుంది. ఈ ఘడియల్లోనే మృగశిర నక్షత్రం ఉండటం, అమృత సిద్ది, సర్వార్థ సిద్దియోగం కూడా ఉండటంతో, రామాలయ ప్రారంభం, విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈ ముహూర్తంలోనే చేపట్టాలని పండితులు నిర్ణయించారు. ప్రాణప్రతిష్ట జరిగే గంటముందు అగ్నిహోమం, హవన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఇప్పటికే వేలాదిమంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యలో వారంరోజులపాటు జరిగే వివిధ రకాల పూజా కార్యక్రమాలను ప్రత్యక్షంగా తిలకించనున్నారు. ప్రత్యక్షంగా అయోధ్య వెళ్లి ఆ కార్యక్రమాన్ని చూడలేకున్నా, వివిధ సామాజిక మాద్యమాల ద్వారా తిలకించి ఆనందించవచ్చు.

Next Story