ఈవీ రంగంలోకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. తొలి బైక్ విడుదల ఎప్పుడంటే?

by Yella Dhawani Reddy |

రోజు రోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి.

ఈవీ రంగంలోకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. తొలి బైక్ విడుదల ఎప్పుడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: రోజు రోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలను (Electric vehicles) ఆదరణ పెరుగుతోంది. ఏటా కార్లు, ఆటోలు, స్కూటర్లలో ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయాలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్‌ చేశాయి. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (Royal Enfield) కూడా ఈవీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోగా తమ తొలి ఎలక్ట్రిక్ వాహాన్ని మార్కెట్లోకి విడుదల చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఫ్లయింగ్ ఫ్లీ (Flying Flea) పేరుతో కొత్తగా స్థాపించిన సబ్‌బ్రాండ్‌ కింద ఈ ఎలక్ట్రిక్ బైకులు అందుబాటులోకి రానున్నాయి.

ఇక ఫ్లయింగ్‌ ఫ్లీ C6, S6 పేరిట వీటిని మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఇవి టెస్టింగ్ దశలో ఉన్నాయి. 2026 జనవరి-మార్చి మధ్య ఈ బైకులను మార్కెటులో లాంచ్‌ చేయనున్నారు. C6 క్లాసిక్ స్టైల్‌తో వస్తుండగా, S6 స్క్రాంబ్లర్ మోడల్‌గా డిజైన్ చేయబడుతోంది. ఇక ఈ సంస్థ నుంచి మార్కెట్లోకి రానున్న మొదటి ఎలక్ట్రిక్ బైక్ C6 అవుతుంది. అలాగే, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వ్యాపార విభాగానికి రూ. 1,500 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టాలని భావిస్తోన్నట్లు సమాచారం. అయితే, ఈ కొత్త EV బ్రాండ్‌కి సంబంధించిన డీలర్‌షిప్, ఆపరేషన్లపై సంస్థ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

ఈ బైక్ మొట్టమొదటిసారి EICMA ప్రదర్శనలో దర్శనమిచ్చింది. తర్వాత భారత్‌లోనూ ప్రదర్శించబడింది. ఇక ఈ బైకులో రౌండ్ LED లైట్లు, అల్యూమినియం చాసిస్‌తో కూడిన స్లిమ్ బాడీ, గిర్డర్ ఫోర్క్స్, స్ప్లిట్ సీట్లు, బ్లాక్ అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, బైక్ బాడీ ఎయిర్‌ఫ్లో నియంత్రణ కోసం మెగ్నీషియం కేసింగ్ కలిగి ఉంది. అంతేకాదు, నగర వాతావరణంలో సులభంగా ఉపయోగించేందుకు ఈ బైక్‌కి తక్కువ బరువు లక్ష్యంగా పెట్టారు. 100 కిలోల లోపలే ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన మోటార్‌సైకిళ్లలో ఇది అత్యధిక ఫీచర్లతో రాబోతోంది.

Next Story