- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏబీఎస్‌ను తప్పనిసరి చేయనున్న కేంద్రం.. పెరుగనున్న బైక్ ధరలు
నిత్యం రోడ్డుపై లక్షల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు పరుగులు పెడుతుంటాయి.

దిశ, వెబ్ డెస్క్: నిత్యం రోడ్డుపై లక్షల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు పరుగులు పెడుతుంటాయి. ఇప్పుడు ఈ ప్రయాణం మరింత సురక్షితంగా మారనుంది. 'ఒక చిన్న బ్రేక్ తప్పిదం జీవితాన్ని మాయం చేయకూడదు' అనే ఆలోచన దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలో విక్రయించే ప్రతి టూవీలర్‌లో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)ను తప్పనిసరి చేయనుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాలని కేంద్రం భావిస్తోంది. ఈమేరకు త్వరలోనే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
ఇప్పటివరకు కేవలం 150 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన వాహనాలకు మాత్రమే ఈ భద్రతా సాంకేతికత తప్పనిసరి అన్న నిబంధన అమలవుతోంది. అంటే స్పోర్ట్ బైక్స్, మిడ్-రేంజ్ బైక్స్ వంటి మోడళ్లలో ఇది ఉండడం ఒక తప్పనిసరి ప్రమాణంగా మారింది. అయితే, దేశంలో మొత్తం ఎంట్రీ లెవల్ మోడళ్లే దాదాపు 75 శాతం వరకు ఉన్నాయి. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 20 శాతం వరకు టూవీలర్ల కారణంగా జరుగుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంట్రీ లెవల్ మోడళ్లు సహా అన్ని టూవీలర్లకూ దీన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశముండగా, వాహన ధరలు మాత్రం కొంత మేర పెరగనున్నాయి.
ఏబీఎస్ వ్యవస్థను వాహనాల్లో అమర్చడం వల్ల కంపెనీల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఆ భారాన్ని కంపెనీలు వినియోగదారులపై వేయనున్నాయి. దీనివల్ల ఎంట్రీ లెవల్ టూవీలర్ మోడళ్ల ధరలు రూ.2500 నుంచి రూ.5 వేల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నాయి. అయితే, ప్రమాదాలను అడ్డుకోవడంలో ఏబీఎస్ ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.
ఏబీఎస్ అంటే?
యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS).. వాహనాల్లో ఒక భద్రతా వ్యవస్థగా ఉపయోగిస్తారు. సడన్ బ్రేకింగ్ సమయంలో చక్రాలు లాక్ అవ్వకుండా నిరోధిస్తుంది. దీనివల్ల డ్రైవర్‌కు వాహనం మీద నియంత్రణ ఉంటుంది. వాహనం స్కిడ్ కాకుండా నివారిస్తుంది. తడిగా ఉండే రోడ్లపై లేదా అత్యవసర పరిస్థితుల్లో వాహనం సురక్షితంగా ఆగుతుంది.






