కొవిడ్ వ్యాక్సిన్‌కు..8 వేల విమానాలు

by  |
కొవిడ్ వ్యాక్సిన్‌కు..8 వేల విమానాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే రష్యా ‘స్పుత్నిక్ వి’ అనే టీకాను మార్కెట్లోకి విడుదల చేసింది. తమ వ్యాక్సిన్ కోసం ఇప్పటికే ఎన్నో దేశాలు క్యూ కడుతున్నట్లు..దాదాపు బిలియన్ డోస్‌ల వ్యాక్సిన్ కోసం 20 దేశాలు ముందస్తుగా ఆర్డర్ చేశాయని రష్యా అధికారిక సంస్థలు వెల్లడించిన విషయం విదితమే. అంతేకాదు.. మరెన్నో దేశాల్లో మరికొన్ని నెలల్లో కరోనాకు వ్యాక్సిన్‌ వస్తుందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ను ప్రపంచం మొత్తానికి సరఫరా చేయాలంటే రవాణా కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నదానిపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే వాటిని రవాణా చేయాలంటే బోయింగ్‌ 747 సైజులో ఉండే దాదాపు 8,000 విమానాలు అవసరమవుతాయని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (IATA) వెల్లడించింది. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఇంకా తయారు కానప్పటికీ, ఒకవేళ వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తే దాని రవాణా ఎలా చేయాలనే అంశంపై విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలు, ఆరోగ్యసంస్థలు, ఫార్మా కంపెనీలతో ఐఏటీఏ చర్చలు జరుపుతోంది.

ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ల మించి జనాభా ఉంది. మరి వారందరికీ కరోనా వ్యాక్సిన్ అందజేయాలంటే సవాలుతో కూడుకున్న పని అని అందరికీ తెలిసిందే. అందుకే కరోనా వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే గ్లోబల్ ఎయిర్ లిఫ్ట్ అవసరమవుతుందని, అందుకోసం 8వేల బోయింగ్ 747 ఫ్రైటర్స్ అవసరమవుతాయని ఐఏటీఏ వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్‌ను అన్నిదేశాలకు చేరవేయడం “రవాణా రంగంలో అతి పెద్ద సవాల్‌’’ అని వైమానిక రంగ నిపుణులు అంటున్నారు . ప్రపంచ ప్రజలకు కావాల్సింది సింగిల్ డోస్ కానీ, ‘జెట్స్ డిమాండ్’ అనేది డబుల్ డోస్ ఐఏటీఏ కార్గో హెడ్ గ్లిన్ హ్యుగ్స్ తెలిపారు. అంతేకాదు అన్ని విమానాలు వ్యాక్సిన్‌‌‌ను తరలించడానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. వీటి తరలింపు సమయంలో విమానంలో 2 నుంచి 8 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. కొన్ని వ్యాక్సిన్‌లకు గడ్డకట్టేంత చల్లదనం అవసరం. కార్గో కెపాసిటీ, ప్రాంతాల పరిమాణం తదితర సమస్యల కారణంగా ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాలకు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ సరఫరా చేయడం సాధ్యం కాదని ఐఏటీఏ వెల్లడించింది. వివిధ ప్రాంతాలో వ్యాక్సిన్‌ను నిల్వ చేయడానికి అవసరమైన ఉష్ణోగ్రతలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 140 వ్యాక్సిన్‌లు తయారీ దశలో ఉన్నాయి. అందులో పాతిక వరకు వ్యాక్సిన్‌లతో క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed