60 లక్షల మందిని రోడ్డున పడేస్తారా.. ఇది న్యాయమా..

by  |
60 లక్షల మందిని రోడ్డున పడేస్తారా.. ఇది న్యాయమా..
X

దిశ, కామారెడ్డి : కొత్త బిల్లుల పేరుతో కార్మికులను రోడ్డున పడేస్తారా అంటూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద కాట్ పా చట్టాన్ని రద్దు చేయాలని ఏఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆ చట్టంలో నుంచి బీడీ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులను మినహాయించాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క పాల్గొని ఆటపాటలతో కార్మికులను ఉత్తేజపరిచారు. ఈ సందర్బంగా విమలక్క మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీడీ పరిశ్రమపై 60 లక్షల మంది ఆధారపడి ఉన్నారని అన్నారు. అందులో తునికాకు తీసుకువచ్చే కార్మికులు 40 లక్షల మంది ఉంటారని తెలిపారు. ఇప్పుడు కాట్ పా చట్టం తేవడం ద్వారా 60 లక్షల మంది రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ చట్టం తేవడం ద్వారా కార్మికులకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారని ప్రశ్నించారు. తమకు ఏ విధంగా ఉపాధి చూపిస్తారని కార్మికులు అడుగుతున్నారని అన్నారు. కార్మికుల న్యాయమైన ఈ డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు.

ఇప్పటికే కరోనా కారణంగా కార్మికులు రోడ్డున పడ్డారని, మళ్లీ బిల్లుల పేరుతో లక్షల మంది జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. వెంటనే ఈ కాట్ పా బిల్లు నుంచి పొగాకు ఉత్పత్తి కార్మికులను మినహాయించాలని, లేకపోతే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఏవోకు వినతిపత్రం అందజేశారు.


Next Story

Most Viewed