పాకిస్థాన్‌లో బాంబు పేలి నలుగురు మృతి.. టార్గెట్ చైనా ప్రతినిధి

by  |
పాకిస్థాన్‌లో బాంబు పేలి నలుగురు మృతి.. టార్గెట్ చైనా ప్రతినిధి
X

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో మరోసారి బాంబుల కలకలం రేగింది. చైనా నుంచి వచ్చిన ఒక ప్రతినిధిని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు.. ఆయన ఉంటున్న ఓ హోటల్‌లో ఆత్మాహుతి బాంబుతో దాడి చేశారు. బలూచిస్తాన్ ప్రావిన్సు రాజధాని క్వెట్టాలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. సుమారు పదిహేను మందికి గాయాలయ్యాయని మీడియా కథనాల ద్వారా తెలుస్తున్నది. ‘ఇది మా పనే..’ అని ఉగ్రవాద సంస్థ తాలిబన్ ప్రకటించుకుంది. క్వెట్టాలోని సెరెనా అనే ప్రాంతంలో ఓ లగ్జరీ హోటల్ లో ఈ ఘటన జరిగింది. బుధవారం పొద్దు పోయిన తర్వాత అక్కడికి చేరుకున్న ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు.. హోటల్ లోని కారు పార్కింగ్ వద్ద తనను తాను పేల్చుకున్నాడని సమాచారం. బలూచిస్తాన్ ఆఫ్ఘాన్‌ను ఆనుకుని ఉన్న రాష్ట్రం కావడంతో తాలిబన్లు తరుచూ ఇక్కడ దాడులకు పాల్పడుతున్నారు.

దాడి ఎందుకు..?

క్వెట్టా లోని హోటల్ లో చైనా ప్రతినిధి తన బృందం (మరో నలుగురు)తో కలిసి అక్కడ దిగారనే సమాచారంతో తాలిబన్లు ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. చైనా ప్రతినిధి.. ఆ దేశం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘వన్ బెల్ట్-వన్ రోడ్’ ప్రాజెక్టులో భాగంగా చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) పై చర్చించడానికి అక్కడికి వచ్చారు. బలూచిస్థాన్ మీదుగా వెళ్తున్న ఈ కారిడార్‌లో చైనాకు తప్ప ఇక్కడి గిరిజనులకు లబ్ది చేకూరేదేమీ లేదని ప్రజలు వాపోతున్నారు. దీనిని నిరసిస్తూ కొద్దికాలంగా అక్కడ నిరసనలు జరుగుతున్నాయి. ఈ కారిడార్ లో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులలో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నా.. అవి స్థానికేతరులకే ఎక్కువ కట్టబెడుతున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా ప్రతినిధి బలూచిస్థాన్ అధికార ప్రతినిధులతో సమావేశమవ్వడానికి రాగా.. తాలిబన్లు ఆయనను టార్గెట్ గా చేసుకున్నారు. అయితే ఆ సమయంలో సదరు ప్రతినిధులెవరూ హోటల్ లో లేరని, మరో సమావేశం నిమిత్తం వాళ్లు బయటకు వెళ్లారని స్థానిక అధికారులు తెలిపారు. బాంబు పేలిన సమయంలో హోటల్ లో కూడా పెద్దగా కస్టమర్లు లేకపోవడంతో భారీ ముప్పు తప్పిందని వారు చెబుతున్నారు.

Next Story

Most Viewed