ఒలింపిక్స్.. ఒక రెఫ్యూజీ టీమ్

by  |
ఒలింపిక్స్.. ఒక రెఫ్యూజీ టీమ్
X

దిశ, స్పోర్ట్స్: ఒలింపిక్స్ అంటే ప్రపంచంలోని ప్రతీ దేశం పాల్గొనే ఒక క్రీడా సంబురం. ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ విశ్వ క్రీడల్లో అనేక దేశాల నుంచి వేలాది మంది అథ్లెట్లు పాల్గొంటారు. తాము పుట్టిన గడ్డకు ప్రాతినిథ్యం వహించడం అంటే అది ఆ క్రీడాకారుడికి గర్వకారణమే. ఇక అదే క్రీడాకారుడు ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే ప్రపంచ విజేతగా మారిపోతాడు. ఇండియాలో 130 కోట్ల మంది జనాభా ఉన్నా.. కేవలం 100 మంది లోపే ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. మన దేశంలో ఉన్న పలు క్రీడా అసోసియేషన్లు ఎన్నో ఏళ్ల నుంచి మేటి క్రీడాకారులను తయారు చేశాయి. పలు అర్హత పోటీల్లో పాల్గొని చాలా కొద్ది మంది మాత్రమే ఒలింపిక్ బెర్తులు సంపాదిస్తారు. మరి దేశం అంటూ లేని వాళ్ల పరిస్థితి ఏమిటి? అసలు దేశం లేనివాళ్లు కూడా ఉంటారా? అంటే మన కళ్ల ముందే కొన్ని లక్షల మంది శరణార్దులుగా ఇతర దేశాల్లో తల దాచుకుంటున్న సంగతి మనం గమనిస్తూనే ఉన్నాం. సిరియా, సూడాన్, ఇరాన్ వంటి దేశాల్లో తలెత్తిన యుద్దాలు, అంతర్గత ఘర్షణల కారణంగా ఎంతో మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు. ముఖ్యంగా యూరోపియన్ దేశాలకే ఎక్కువ మంది రెఫ్యూజీలుగా వెళ్లి తలదాచుకుంటున్నారు. వారిలో ఎంతో మంది క్రీడాకారులు కూడా ఉన్నారు. అలాంటి వారిని ప్రత్యేక కేటగిరీగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అనుమతి ఇస్తుంది. ఈ సారి టోక్యో ఒలింపిక్స్‌లో కూడా రెఫ్యూజీ టీమ్‌ను ఐవోసీ అనుమతి ఇచ్చింది.

2016లోనే తొలి సారి..

ఆధునిక ఒలింపిక్స్ 1896లో ప్రారంభమయ్యాయి. ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరిగే విశ్వక్రీడల్లో 200పైగా దేశాలకు చెందిన అథ్లెట్లు పోటీ పడుతున్నారు. అయితే తమ సొంత దేశాల్లో జరిగే అరాచకాలు, అంతర్యుద్దాల కారణంగా ఎంతో మంది పరాయి దేశాలకు వెళ్లిపోతున్నారు. వీరిలో మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులు కూడా ఉన్నారు. గత రెండు దశాబ్దాల్లో పశ్చిమాశియా, ఆఫ్రికా దేశాల్లో యుద్దం, కరువుల కారణంగా చాలా మంది యూరోప్ దేశాలకు వెళ్లిపోయారు. వారి కోసం ప్రత్యేకంగా 2016 రియో ఒలింపిక్స్‌లో రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్ (ఆర్‌వోటీ) కోడ్ నేమ్‌తో కొంత మంది క్రీడాకారులను ఐవోసీ అనుమతి ఇచ్చింది. రియో ఒలింపిక్స్‌కు 10 మంది క్రీడాకారులు రిఫ్యూజీ టీమ్‌గా పాల్గొన్నారు. ఇద్దరు స్విమ్మర్లు, ఇద్దరు జూడా క్రీడాకారులు, ఒక మారథాన్ రన్నర్, ఐదుగురు మధ్యస్థ రన్నర్లు ఉన్నారు. రెఫ్యూజీ అథ్లెట్లను హోస్ట్ నేషన్ పంపిస్తుంది. అంతే వాళ్లు ఏ దేశంలో శరణార్దులుగా ఉంటున్నారో ఆ దేశాన్ని హోస్ట్ నేషన్ అంటారు.

ఈ సారి 29 మంది..

టోక్యో ఒలింపిక్స్‌కు 29 మంది క్రీడాకారులను ఐవోసీ అనుమతించింది. 13 దేశాలకు చెందిన ఒలింపిక్ కమిటీలు కలసి వీరిని ఎంపిక చేశాయి. ఈ 29 మంది అథ్లెట్లు 12 క్రీడల్లో పోటీ పడనున్నారు. వీరికి ఈవోఆర్ అనే కోడ్ కేటాయించారు. ఐవోసీకి ఫ్రెంచ్ భాషలో సంక్షప్త నామమే ఈవోఆర్. గత వారమే ఐవోసీ ఈ 29 మంది క్రీడాకారుల పేర్లు ప్రకటించింది.

1. అలా మాసో (హోస్ట్ నేషన్ జర్మనీ, సొంత దేశం సిరియా) – స్విమ్మింగ్ 50 మీటర్లు
2. యుస్రా మర్దీని (జర్మనీ, సిరియా) – బటర్‌ఫ్లై 100 మీటర్లు
3. డోరియన్ కెలెటెలా (పోర్చుగల్, కాంగో) – 100 మీటర్ల పరుగు
4. రోస్ నథీకి లికోన్యన్ (కెన్యా, సౌత్ సూడాన్) – 800 మీటర్ల పరుగు
5. జేమ్స్ యాంగ్ చింగ్‌జిక్ (కెన్యా. సౌత్ సూడాన్) – 800 మీటర్లు పరుగు
6. యాంజిలీనా నదాయ్ లోహలిత్ (కెన్యా, సౌత్ సూడాన్) – 1500 మీటర్లు పరుగు
7. పౌలో అమోటున్ లొకోరో (కెన్యా, సౌత్ సూడాన్) – 1500 మీటర్ల పరుగు
8. జమాల్ అబ్దుల్‌మాజీ ఈసా (ఇజ్రాయేల్, సూడాన్) – 5000 మీటర్ల పరుగు
9. తక్లోవినీ గాబ్రియేసోస్ (ఇజ్రాయేల్, ఎరిత్రియా) – మారథాన్
10. అరమ్ మహముద్ (నెదర్లాండ్స్, సిరియా) – మెన్స్ సింగిల్స్, బ్యాడ్మింటన్
11. వెస్సమ్ సలమానా (జర్మనీ, సిరియా) – బాక్సింగ్ లైట్ వెయిట్
12. ఎల్డ్రిక్ సెల్లా రోడ్రిగ్స్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో, వెనుజులా) – బాక్సింగ్ మిడిల్ వెయిట్
13. సయిద్ ఫజ్లోలా (జర్మనీ, ఇరాన్) – కయాకింగ్ సింగిల్
14. మసోమా అలీ జాదా (ఫ్రాన్స్, ఆఫ్ఘనిస్తాన్) – సైక్లింగ్
15. అహ్మద్ బద్రీదిన్ వాయిస్ (స్విట్జర్లాండ్, సిరియా) – సైక్లింగ్
16. సాండా అల్దాస్ (నెదర్లాండ్స్, సిరియా) – జూడో
17. అహ్మద్ అలీకజ్ (జర్మనీ, సిరియా) – జూడో
18. మూన దహౌక్ (నెదర్లాండ్స్, సిరియా) – జూడో
19. జావద్ మహ్‌జోబ్ (కెనడా, ఇరాన్) – జూడో
20. పోపోలే మిసింగా (బ్రెజిల్, డీఆర్ కాంగో) – జూడో
21. నిగార షహీన్ (రష్యా, ఆఫ్గనిస్తాన్) – జూడో
22. వాయిల్ షుయెబ్ (జర్మనీ, సిరియా) – కరాటే
23. హమూన్ దారాఫ్‌షిపూర్ (కెనడా, ఇరాన్) – కరాటే
24. లూనా సాల్మన్ (స్విట్జర్లాండ్, ఎరిత్రియా) – షూటింగ్
25. దినా లాంగిరోడీ (నెదర్లాండ్స్, ఇరాన్) – తైక్వాండో
26. కిమియా అలీ జదేహ్ (జర్మనీ, ఇరాన్)- తైక్వాండో
27. అబ్దుల్లా సిదిఖీ (బెల్జియం, ఆఫ్ఘనిస్తాన్) – తైక్వాండో
28. సిరిల్ ఫగట్ (యూకే, కామెరూన్) – వెయిట్ లిఫ్టింగ్
29. అకెర్ ఒల్ ఓబేడీ (ఆస్ట్రియా, ఇరాక్) – రెజ్లింగ్


Next Story