ఆ 13 వేల ఎకరాల సంగతేంటి?

by  |
ఆ 13 వేల ఎకరాల సంగతేంటి?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దశాబ్దాలుగా పోడు భూముల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. గిరిజనులు తాము నివాసముండే ప్రాంతాలను ఆనుకుని ఉన్న అడవిని నరికి సాగు చేస్తున్నారు. అవి పట్టా భూములైతే రెవెన్యూ అధికారులు హక్కు పత్రాలు ఇస్తున్నారు. అదే రిజర్వ్​ ఫారెస్ట్​ భూములైతే అడ్డుకోవడం.. కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఈ తరహా గొడవలు రైతులకు, అధికారులకు మధ్య సర్వసాధారణంగా మారాయి. ఈ క్రమంలో వివాదాస్పద భూములను ఆటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే చేసి హద్దులు నిర్ణయించాయి. అయితే నెల రోజులు దాటినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో ఆయా శాఖలు స్తబ్ధుగా ఉన్నాయి. విషయం ఎటూ తేకపోవడంతో మళ్లీ సాగు విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయని, తమకు కేసుల నుంచి విముక్తి కల్పించి అదుకోవాలని పోడు రైతులు కోరుతున్నారు.

నెరవేరని హామీలు

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోడు భూముల్లో పంటలు సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇస్తామని హమీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా ఆచరణకు నోచుకోలేదు. నిజామాబాద్ జిల్లాలో 19.30 శాతం భూభాగం అడవులు ఉన్నాయి. 853.21 కిలో మీటర్ల విస్తీర్ణంలో ఆటవీ ప్రాంతం ఉంది. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ సౌత్, నార్త్, వర్ని, ఇందల్వాయి, కమ్మర్ పల్లిలో ఆటవీ భూములు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 600 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆడవీ ప్రాంతం ఉంది. మాచారెడ్డి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ రేంజ్​పరిధిలో ఆటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో వేలాది ఎకరాల వివాదాస్పద భూములు ఉన్నాయి. పట్టా భూములకు అధికారులు హక్కు పత్రాలు ఇవ్వగా, సర్వే చేసి కొన్ని అటవీ ప్రాంత భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాంటివి నిజామాబాద్ జిల్లా పరిధిలో 8,176 ఎకరాలు, కామారెడ్డి జిల్లా పరిధిలో 5,070 ఎకరాల భూమి ఉంది. ప్రతీ ఏడాది అధికారుల మధ్య నలుగుతూ ఆయా భూములను రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల రెవెన్యూ, ఫారెస్టు అధికారులు జాయింట్​సర్వే చేశారని, వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

2014 ఫిబ్రవరి నెలలో నిజామాబాద్ జిల్లా నాటి ధర్పల్లి మండలం నల్లవెల్లి గ్రామ శివారు కేకే తండాకు చెందిన గిరిజనులు ఆటవీ భూమిని ట్రాక్టర్లతో చదును చేస్తున్నారనినే సమాచారంతో అడ్డుకునేందుకు వెళ్లిన ఇందల్వాయి ఆటవీ రేంజ్ అధికారి రొడ్డ గంగయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు కారణమైన గిరిజనులు, సీపీఎం నేతలు జైలు ఊచలను లెక్కపెట్టాల్సి వచ్చింది. రేంజ్​అధికారి హత్యతో తెలంగాణ ఏర్పడిన ఏర్పడిన తరువాత ఆటవీ అధికారులకు ఆయుధాలు ఇవ్వాలనే డిమాండ్​మరోసారి తెరపైకి వచ్చింది.

వర్ని మండలం శత్రునాయక్ తండా శివారులో 100 ఎకరాల ఆటవీ భూమి ఉండగా 20 ఎకరాల్లో జొన్న సాగు చేస్తున్నారని సమాచారం అందుకున్న ఆటవీ శాఖ అధికారులు 2020 సెప్టెంబర్ 10 న ఘటనా స్థలానికి వెళ్లారు. అడ్డుకున్న గిరిజనులను అక్కడి నుంచి తప్పించి పంటలను ధ్వంసం చేశారు. తరువాత చందూర్​మండలం మేడిపల్లి తండా శివారులోని మూడెకరాల ఆటవీ భూమిలోని పంటలను ఫారెస్టు అధికారులు నేలమట్టం చేశారు. ఈ రెండు సంఘటనలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. ప్రతిపక్ష నేతలు పోడు భూములను పరిశీలించి ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశారు.

2019-20 సంవత్సర కాలంలో నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప బీట్ పరిధిలోని కాల్లోల్​తండా పరిధిలో 14 మంది గిరిజనులు అడవిని నరికి చదను చేశారు. వర్ని మండలం చందూర్ సెక్షన్ పరిధి జలాల్ పూర్ రిజర్వ్​ ఫారెస్టులో 33 మంది లంబాడాలు ఆటవిని చదను చేసి వ్యవసాయానికి అనుకూలంగా మార్చారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రేంజ్​పరిధి లక్ష్మాపూర్ ఆటవీ ప్రాంతంలో 17 మంది గిరిజనులు, గాందారి రేంజ్ పరిధి గండివేట్ ఆటవీ ప్రాంతంలో 17 మంది అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేశారు. వారందరిపై పోలీసు కేసులతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కానీ, ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం, ఉత్తర్వులతో ఆటవీ భూములను కబ్జా చేసిన వారికి ప్రభుత్వం తరఫున అందే తొమ్మిది రకాల సేవలను నిలిపివేశారు.


Next Story

Most Viewed