13 కారణాలు ఎందుకు?

by  |
13 కారణాలు ఎందుకు?
X

అమెరికన్ టీవీ సిరీస్‌లలో టీనేజీ డ్రామాలకు మంచి పాపులారిటీ ఉంది. మారుతున్న ప్రపంచానికి తగ్గట్లుగా అక్కడి టీనేజీ పిల్లల అస్తవ్యస్త స్వభావాలను ఈ డ్రామాల్లో చూపిస్తుంటారు. అలాంటి ఒక టీనేజీ డ్రామానే ‘13 రీజన్స్ వై’. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ఈ సిరీస్ చివరి సీజన్ జూన్ 5వ తేదీన విడుదలైంది. అయితే మొదటి రెండు సీజన్లకు ఉన్నంత క్రేజ్ ఈ నాలుగో సీజన్‌కి రాలేదు. అందుకు ప్రధాన కారణం మూడో సీజన్. మూడో సీజన్ విడుదలైనప్పుడే చాలా మంది పెదవి విరిచారు. ‘అనవసరంగా మూడో సీజన్ తీశారు, రెండు సీజన్లతో పూర్తి చేసుంటే బాగుండేది’ అన్నారు. కానీ ఇప్పుడు నాలుగో సీజన్‌కి మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు. కథనం ఒకే విధంగా ఉన్నా పాత్రలకు సరైన ముగింపు ఇవ్వడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే నాలుగో సీజన్ ప్రస్తావన కంటే ముందుగా మొదటి మూడు సీజన్ల గురించి కాస్త క్లుప్తంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

అమెరికన్ పాఠశాలల్లో చదువుతున్న టీనేజర్ల మానసిక స్థితిని ఈ సిరీస్ ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. హానా బేకర్ అనే అమ్మాయి తన బాత్రూమ్‌లో చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అందుకు గల కారణాలను టేపులుగా రికార్డు చేస్తుంది. ఒక్కో టేపులో తనతో పాటు చదువుతున్న వారు ఏ రకంగా తన ఆత్మహత్యకు కారణమయ్యారో పూసగుచ్చినట్లుగా వివరిస్తుంది. మొత్తం 13 మంది గురించి 13 టేపుల్లో రికార్డు చేస్తుంది. వాటిని రెండు కాపీలు చేసి ఒక కాపీ టేపులను తన నమ్మకస్తుడికి ఇస్తుంది. ఆ 13 మంది ఒక్కొక్కరుగా ఆ టేపులు విని, ఆ టేపుల నెంబర్ల ప్రకారం తర్వాతి వారికి పంపించాలి. ఇలా జరగకపోతే ఆ నమ్మకస్తుడు తన దగ్గర ఉన్న టేపులను పోలీసులకు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే టేపులు క్లే జెన్సన్ దగ్గరికి వస్తాయి. ఒక్కో టేపు ఒక్కో ఎపిసోడ్‌గా మొత్తం 13 ఎపిసోడ్లతో మొదటి సీజన్ ముగుస్తుంది.

రెండో సీజన్‌లో కథ మొదటి సీజన్ మాదిరిగానే ఉంటుంది, కానీ కథనం మారుతుంది. అంటే మొదటి సీజన్‌లో హానా తాను చనిపోవడానికి ఒక్కొక్కరు ఎలా కారణమయ్యారో వివరిస్తే, ఈ రెండో సీజన్‌లో ఆ కారణమైన వారు తాము ఎందుకు కారణమయ్యారో, హానా ఏ విధంగా వాళ్లని అపార్థం చేసుకుందో సంజాయిషీ ఇచ్చుకుంటారు. హానాతో వాళ్లకున్న బంధానికి వివరణ ఇచ్చుకుంటారు. ఆ 13 మందిలో మంచివాళ్లైన 6గురు స్నేహబృందం, హానాతో పాటు స్కూళ్లో ఎంతోమంది అమ్మాయిలకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతారు. చివరికి హానాకు న్యాయం జరిగేలా చేస్తారు. ఈ సీజన్‌తో హానా పాత్ర ముగుస్తుంది.

ఇక మూడో సీజన్‌లో హానా ప్రస్తావనే ఉండదు. కానీ ఒక కొత్త పాత్ర ఎంట్రీ ఇస్తుంది. పేరు యానీ ఆమొరవాట్. హానా చదివిన స్కూళ్లోనే కొత్తగా చేరుతుంది. తాను పాఠశాలలో అడ్జస్ట్ అయ్యే క్రమంలో ఒక్కొక్కరినీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే హానాతో పాటు ఇతర అమ్మాయిలకు అన్యాయం చేసిన ప్రధాన వ్యక్తి హత్యకు గురవుతాడు. అయితే ‘ఈ హత్య చేసింది ఆ మంచివాళ్ల బృందంలో ఒకరే’ అని అనుమానాలు తలెత్తుతాయి. నిజంగా వాళ్లే చేశారా? చేస్తే కలిసి చేశారా? లేదా ఒక్కరే చేశారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈ సీజన్ ముగుస్తుంది. అయితే ఆ హత్య చేసిన వారంతా కలిసి వేరే వ్యక్తిని హంతకుడిగా ఫ్రేమ్ చేస్తారు. ఆ వ్యక్తి జైల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు.

హానాకు అన్యాయం చేసిన వ్యక్తిని హత్య చేసింది జైల్లో చనిపోయిన వాడు కాదని, అందరూ కలిసి అతని మీద తప్పుడు నింద వేశారని తెలిసిన ఒకే ఒక వ్యక్తి, ఆ ఫ్రేమ్ చేసిన వారి మీద పగతీర్చుకోవాలనుకుంటాడు. శుక్రవారం విడుదలైన నాలుగో సీజన్‌లో ఇదే చూపించారు. అది పక్కన పెడితే ఈ సీజన్‌లో ప్రతి పాత్రకు న్యాయమైన ముగింపు ఇవ్వడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. దాని పూర్తి వివరాలు తెలియాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో చూడాల్సిందే!


Next Story

Most Viewed