చేప జన్యువులతో మచ్చలు మాయం?

by  |
చేప జన్యువులతో మచ్చలు మాయం?
X

దిశ, వెబ్‌డెస్క్: మచ్చలు అనగానే అందరూ పుట్టుకతో వచ్చిన మచ్చలనే అనుకుంటారు. కానీ గాయాలు, ప్రమాదాలు, వ్యాక్సినేషన్, సర్జరీ, సిజేరియన్ వల్ల కూడా కొన్ని మచ్చలు ఏర్పడతాయి. ఇలాంటి మచ్చల వల్ల భౌతికంగా నొప్పి, దురదతో పాటు ఆయా శరీర భాగాలపై ప్రభావం చూపుతాయి. అంతేకాదు ఇవి మెంటల్ హెల్త్‌పైనా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కాగా కొందరు సెలెబ్రిటీలు ఈ తరహా మచ్చలు లేదా చారలను పోగొట్టుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. ఇక బ్రిటన్‌లో అయితే దాదాపు 20 మిలియన్ మందికి మచ్చలున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో ‘ద స్కార్ ఫ్రీ ఫౌండేషన్’.. శరీర భాగాలపైనున్న మచ్చలను సహజ పద్ధతిలో నయం చేసేందుకు, మచ్చల వల్ల ప్రభావితమైన వారిని రక్షించేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే జీబ్రా చేపతో మచ్చలను నయం చేయొచ్చని తేలింది. ఈ విషయమై అధ్యయనం చేస్తోన్న బ్రిస్టొల్ యూనివర్సిటీ పరిశోధనా బృందానికి సదరు ఫౌండేషన్ రూ.10 కోట్ల 95 లక్షలు ఫండింగ్ ఇచ్చింది. ఈ చేపలతో మచ్చలు నిజంగా మటుమాయమవుతాయా? చేప జన్యువులతో మానవ డీఎన్ఏకి సంబధం ఏంటి? ఈ చేపలోని ఔషధ గుణాలెంటి? ఇక్కడ తెలుసుకుందాం.

నీళ్లలో మిలమిలా మెరిసిపోయే ఈ చేపలపై ఉండే నీలం రంగు చారలు అచ్చం జీబ్రా చారల్లానే ఉండటంతో.. వీటికి జీబ్రా చేపలనే పేరొచ్చింది. చేపలోని వర్ణ కణాల వల్లే ఈ తరహా చారలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు. ఈ కణాలకు రంగు, ఆకారం మార్చే శక్తి కూడా ఉంటుంది. ఇవి మొప్పల్ని, గుండె కండరాల్ని కూడా పునరుత్పత్తి చేసుకోగలవు. మనుషుల వలె వీటికి వెన్నుముక కూడా ఉంటుంది. సన్నగా ఉండే ఈ చేపలు రెండున్నర అంగుళాల పొడవుంటాయి. అంతేకాదు మనిషి మెదడు జెనెటిక్‌ కోడ్‌తో పోలిస్తే జీబ్రా చేప మెదడుకు 90 శాతం సరిపోలుతుందట. అందుకే దీని ద్వారా మచ్చలు పోగొట్టొచ్చని బ్రిస్టొల్ యూనివర్సిటీ పరిశోధకులు భావిస్తున్నారు. మంచినీళ్లలో(ఎప్పుడూ ప్రవాహిస్తుండే) మాత్రమే ఉండే ఈ చేపలను ఆక్వేరియాల్లోనూ పెంచుతుంటారు. ఇవి ఎక్కువగా దక్షిణ ఆసియాలోని భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్‌లో ఉంటాయి. ఈ చేపలకు అంతర్గతంగా ఏవైనా గాయాలైనా, వాటంతట అవే నయం చేసుకోగలవు. జన్యుపరిశీలన చేసినప్పుడు అది తన ప్రవర్తనలో ఎలాంటి మార్పులకు లోనవుతుందో చేప పారదర్శక చర్మం ద్వారా మైక్రోస్కోప్‌పై అబ్జర్వ్ చేయొచ్చు. దీనినే ‘లైవ్ ఇమేజింగ్’ అంటారు. ఈ కారణాల రిత్యా ఈ చేపను పరిశోధనకు ఎంచుకున్నట్లు పరిశోధకులు తెలిపారు.

పరిశోధకులు ‘లైవ్ ఇమేజింగ్’ ద్వారా మచ్చలు లేదా చారలు ఏర్పడటానికి జన్యుపరంగా ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి? గాయాలను ఎలా తగ్గించొచ్చు? తగ్గించడానికి ఏ పద్ధతులు పాటించాలి? అనే విషయాలు పరిశోధనల ద్వారా తెలిసే అవకాశముందని పరిశోధకుడు బెక్ రిచర్డ్‌సన్ తెలిపారు. ఈ పరిశోధన సఫలమైతే ఒక్క బ్రిటన్‌లో‌నే కాదు ప్రపంచవ్యాప్తంగా మానవులపై ఉన్న మచ్చలను మాయం చేయొచ్చు. జీబ్రాచేపలతో మచ్చలు నయమైతే వైద్యరంగంలో భారీ పురోగతి సాధించినట్లే.. తద్వారా సముద్ర పర్యావరణం వైద్యరంగానికి మూలాధారం అవుతుంది. సముద్రాలను ఎందుకు పరిరక్షించుకోవాలో? ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. ఈ అధ్యయనం నవంబర్ 2020న ప్రారంభం కాగా, పరిశోధకులు ఐదేళ్ల పాటు జీబ్రాచేపలపై అధ్యయనం చేయనున్నారు. చేపల జన్యువు, కణజాలంతో మచ్చలు నయమవుతాయా? లేదా తెలియాలంటే 2025లో ఈ స్టడీ పూర్తయ్యేవరకు ఆగాల్సిందే.

Next Story