సీఎం జగన్ పై ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం

by  |
raghurama krishnam raju,
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తనేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ గుర్తుపై గెలిచి పార్టీ అధినేతపైనే విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచే ఆయన మరోసారి నిప్పులు చెరిగారు. మారిటైమ్ ఇండియా సదస్సులో పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని సీఎం జగన్ ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన వెనుక ఉన్న చిదంబర రహస్యం ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీలోని తన నివాసంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రం దివాళా తీసి అప్పులతో సతమతమవుతుంటే మూడు పోర్టులు ఎలా కడతారని నిలదీశారు.

దానికోసం మళ్లీ అప్పులు చేస్తారా అని ప్రశ్నించారు. పోర్టుల కోసం తెచ్చిన ఆ అప్పులలో కొంత డబ్బును మళ్లీ సంక్షేమ పథకాలకు వాడాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయని అలాగే ఆదాయం కూడా తగ్గుతోందని గుర్తు చేశారు. జీడీపీ సైతం తక్కువగా ఉందన్నారు. ఇలాంటి తరుణంలో పోర్టుల నిర్మాణం సమంజసం కాదన్నారు. ఎవడూ రాడనే మీరే పోర్టులు కట్టేస్తామని అనడం సరికాదన్నారు. వ్యాపారస్తుడు రానప్పుడు మనం ఎందుకు పోర్టులు నిర్మిస్తామని ముందుకు వెళ్లాలి అని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులతో ఏపీ దివాలా ఆంధ్రప్రదేశ్‌గా మారుతోందని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనన్ని అప్పులు మన రాష్ట్ర ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. అప్పుల్లో ఏపీ ఫస్ట్ ప్లేస్ లో ఉందన్న ఆయన ద్రవ్యలోటు మరీ దరిద్రంగా మారిందని చెప్పుకొచ్చారు. ఇలాంటి తరుణంలో మూడు పోర్టులు నిర్మించాలంటే ఎన్ని కోట్లు అప్పులు చేయాలో ప్రభుత్వం ఆలోచించుకోవాలన్నారు. పోర్టుల నిర్మాణం పేరుతో ఇంకేమి అమ్ముతారని ప్రశ్నించారు. అనుభవం లేని మందుల కంపెనీకి పోర్టుల నిర్మాణ కాంట్రాక్టు ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పోర్టులకు వ్యాపారం లేక ఉసూరుమంటూ ఉంటే..రాష్ట్ర ప్రభుత్వం అప్పుచేసి కొత్త పోర్టుల నిర్మిస్తామని ప్రకటించడం అవసరమా అంటూ ప్రశ్నించారు. ఒకవేళ డబ్బు ఉంటే పోలవరం, రాయలసీమ పెండింగు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు హితవు పలికారు.

Next Story

Most Viewed