AP Politics: మత్స్యకారుల మద్దతు కూటమికే

by Disha Web Desk 3 |
AP Politics: మత్స్యకారుల మద్దతు కూటమికే
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖను ఒకప్పుడు పెద్ద మత్స్యకార పల్లె అని పిలిచేవారు. మత్స్యకారులు లేని విశాఖను, సముద్రంలో చేపల వేట జరగని విశాఖను ఊహించలేం. విశాఖ గడ్డన పుట్టిన ఈ మత్స్యాకార బిడ్డల ఓటు ఏ ఎన్నికలలో అయినా కీలకమే. వైసీపీ ఐదేళ్ల పాలనలో తమకు జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని గుర్తు తెచ్చుకొంటూ ఈ పర్యాయం మత్స్యకారులు కూటమి పక్షాలకే మద్దతుగా నిలుస్తున్నారు. కష్టాల్లో, నష్టాల్లో కూటమి పక్షాల నేతలే తమకు అండగా వుండి ఆదుకొన్నారని వారు బహిరంగంగానే చెబుతున్నారు.

పెద జాలరిపేట కబ్జాకు గట్టి ప్రయత్నం

విశాఖ నగరంలో కీలకమైన పెద్ద జాలరి పేటను బినామీ డాక్యుమెంట్లతో కబ్జా చేసేందుకు ఉత్తరాంధ్రా పార్టీ ఇన్చార్జిగా విజయసాయి రెడ్డి వుండగా గట్టి ప్రయత్నం జరిగింది. విశాఖ అంటే గుర్తుకు వచ్చే పెద జాలరిపేట ఎవరో రాజులదంటూ వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి నేతృత్వంలో హస్తగతం చేసుకొనే ప్రయత్నం చేశారు. సర్వే పేరిట ఇళ్లకు వెళ్లి వందేళ్లకు పైగా అక్కడ వుంటున్న జాలర్లను ఆ భూముల మీవికావంటూ బెదిరించారు. రాణి వాద్వాన్ వారసులకు ఈ భూములు దఖలు పడ్డాయి కాబట్టి రెవిన్యూ రికార్డులతో వారి పేర్లు చేర్చాలని జిల్లా కలెక్టర్‌పై గట్టిగా వత్తిడి తీసుకువచ్చారు. వారిని ఖాళీ చేయించడం సాధ్యం కాదు కాబట్టి ప్రత్యామ్నాయంగా ఆ స్థలానికి రాష్ర్ట మున్సిపల్ విభాగం నుంచి వేల కోట్ల రూపాయల విలువ చేసే టీడీ‌ఆర్ బాండ్‌లు కొట్టేయాలన్నది వారి పన్నాగం. ఇందుకోసం రూ.2800 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్‌లు ఇవ్వాలంటూ దరఖాస్తులు చేసి ఫైళ్లు కదిపారు. జనసేన నేత మూర్తి యాదవ్ దీనిపై బహిర్గతం చేసి గొడవ చేయడం, ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా ఆగింది. తాజాగా ఎన్నికల వేళ మత్స్యకారులు ఈ సమస్యను తెలియజేస్తూ ఫ్లెక్సీలతో తెలుగుదేశం నేతలకు స్వాగతం పలికారు.

వైసీపీ గద్దలను తరిమికొడతాం... టీడీపీ

తెలుగుదేశం నేతలు కూడా దీనిపై ఘాటుగా స్పందించారు. జాలరి పేటపై వాలిన వైసీపీ గద్దల నుంచి గ్రామాన్ని రక్షిస్తామని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ తూర్పు నియోజకవర్గం అభ్యర్థులు శ్రీ భరత్, వెలగపూడి రామకృష్ణబాబు స్పష్టం చేశారు. జాలరిపేట గ్రామాన్ని ఖాళీ చేయించి జాలర్లకు తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌‌టీ రామారావు పాలనా కాలంలో కల్పించిన హక్కును రద్దు చేయాలని చూస్తున్న వైసీపీ నేతలను తరిమికొడతామని హెచ్చరించారు. జాలరిపేట గ్రామంలో జరిగిన సమావేశంలో అభ్యర్థులు ప్రసంగించి మత్యకార హక్కులను కాపాడతామని గట్టి భరోసా ఇచ్చి మద్దతు కూడగట్టారు.

బోట్లు కాలిపోయినప్పుడు స్పందించింది జనసేనే

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాదం జరిగి 40కి పైగా బోట్‌లు కాలిపోయినప్పడు అందరికంటే ముందుగా స్పందించింది, సాయం అందించిందీ జనసేన కావడం ఇప్పుడు విశాఖ దక్షిణ జనసేన అభ్యర్థి వంశీ‌కృష్ణ శ్రీనివాస్ కి కలసివస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమాద స్థలానికి వచ్చి పార్టీ సొంత నిధులతో సాయం అందించారు. ప్రమాదంలో పూర్తిగా నష్టపోయిన వారిని, పాక్షికంగా నష్టపోయినవారిని గుర్తించి సాయం అందించారు. పవన్ రాకతో ప్రభుత్వం కూడా కాస్త ఆలస్యంగా అయినా స్పందించి ప్యాకేజీ ప్రకటించింది. అయితే, ఇందులో అక్రమాలు జరగడం, నిజమైన లబ్ధిదారులను పక్కన పెట్టి పార్టీ అభిమానులకు ఇవ్వడం పెద్ద వివాదంగా మారింది. ఇదికూడా చివరకు కూటమి అభ్యర్థులకే మేలు చేసేదిగా మారింది.

బీచ్ కబ్జాల్లో వైసీపీ పాత్ర

విశాఖ నుంచి భీమిలివరకూ ఉన్న తీర ప్రాంతం ఈ ఐదేళ్ల వైసీపీ పాలనా కాలంలో పెద్ద ఎత్తున కబ్జాలకు గురైంది. కబ్జాల కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లే ప్రాంతాలు, చేపలు, వలలు అరపెట్టుకొనే ప్రాంతాలు నిబంధనలకు విరుద్ధంగా కబ్జా అయ్యాయి. తీర ప్రాంతానికి రక్షణ కల్పించే కోస్తా నియంత్రణ మండలి (సీ ఆర్ జడ్) నిబంధనలకు విరుద్ధంగా ఈ కబ్జాలు జరుగుతున్నా, ఫిర్యాదులు, ఆందోళనలు చేసినా అధికారులు స్పందించలేదు. అధికార పార్టీ అండతో కబ్జాలు జరగడం వల్లే అధికారులు ఏమీ చేయలేకపోతున్నారని గ్రహించిన మత్స్యకారులు ఇప్పుడు ఆ పార్టీకి దూరమౌతున్నారు. చివరకు భీమిలిలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన కబ్జాను జనసేన నేత మూర్తి యాదవ్ హైకోర్టును వెళ్లి అడ్డుకొన్నారు. ఇటువంటివన్నీ ఎన్నికల సమయంలో ప్రభావం చూపుతున్నాయి.

హామీలతో భరోసా

వేటకు వెళ్లే సమయాల్లో జరిగే ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక వ్యవస్థ తీసుకొస్తామని కూటమి ప్రకటించింది. ప్రతి బోట్‌కు జీపీఎస్ వ్యవస్థ తీసుకొస్తామని ప్రతి మత్స్యకారులకు బీమా సౌకర్యం కల్పిస్తామని, డీజిల్ సబ్సిడీని పెంచుతామని కూటమి నేతలు హామీ ఇస్తూ మద్దతు కూడగడుతున్నారు.

Next Story

Most Viewed