ఇడుపులపాయకు వైఎస్ షర్మిల

by  |
YS Sharmila
X

దిశ, తెలంగాణ బ్యూరో : దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు షర్మిల బుధవారం ఇడుపులపాయకు తరలివెళ్లారు. గురువారం ఉదయం తన తండ్రి సమాధి వద్ద తల్లి విజయమ్మతో కలిసి నివాళులర్పించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 1 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా పంజాగుట్ట సర్కిల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఆమె నివాళులర్పించనున్నారు. అనంతరం లోటస్ పాండ్‌కు చేరుకొని జాబ్ మేళా, రక్తదాన శిబిరాన్ని పర్యవేక్షించనున్నారు. ఈ రక్తదాన శిబిరానికి వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలిరావాలని షర్మిల కార్యాలయవర్గం తెలిపింది. ఇదిలా ఉండగా సాయంత్రం 5.30 గంటలకు విజయమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైఎస్సార్ సంస్మరణ సభకు షర్మిల హాజరుకానున్నారు.

తెలంగాణ సర్కార్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలేదని, అయితే వైఎస్సార్ తెలంగాణ పార్టీ తరుపున తనవంతుగా నిరుద్యోగులకు అండగా నిలవాలని ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకుడు, వైఎస్సార్ టీపీ యూత్ కమిటీ మెంబర్ అద్నాన్ ఖాన్ తెలిపారు. లోటస్ పాండ్‌లో గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆయన చెప్పారు.

ఈ జాబ్ మేళాలో సుమారు 35 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని, ఇందులో పలు ఎంఎన్‌సీ కంపెనీలు సైతం ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ మేళా ద్వారా కనీసం 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పదో తరగతి నుంచి డిగ్రీ, పీజీ చదువుకున్న యువత తమ విద్యార్హతల ధృవపత్రాలు, రెజ్యూమ్ తో హాజరుకావాలని తెలిపారు.


Next Story

Most Viewed