- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా దూకుడు పై భగ్గుమన్న ప్రపంచ దేశాలు.. వెనిజులా దాడులపై రష్యా, చైనా తీవ్ర ఆగ్రహం!
వెనిజులా రాజధాని కరాకస్‌పై అగ్రరాజ్యం అమెరికా మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ దాడులపై రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలు తీవ్రంగా ఖండించాయి.

దిశ, వెబ్ డెస్క్: వెనిజులా రాజధాని కరాకస్ (Caracas,)పై అగ్రరాజ్యం అమెరికా (America) మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ దాడులపై రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలు తీవ్రంగా ఖండించాయి. రష్యా విదేశాంగ శాఖ ఈ చర్యను "సాయుధ దురాక్రమణ"గా అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టాలను అమెరికా బహిరంగంగా ఉల్లంఘిస్తోందని మండిపడింది. చైనా సైతం ఈ దాడులను వ్యతిరేకిస్తూ, వెనిజులా సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని హితవు పలికింది. ఇరాన్ ఈ దాడులను "రాజ్య ఉగ్రవాదం"గా పేర్కొంటూ, ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవడం ప్రపంచ శాంతికి విఘాతమని హెచ్చరించింది. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డయాజ్-కానెల్ స్పందిస్తూ, ఇది లాటిన్ అమెరికాపై జరిగిన దాడి అని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, ఐక్యరాజ్యసమితి (UN)లో ఈ ఉద్రిక్తతలపై అత్యవసర చర్చకు వెనిజులా విదేశాంగ మంత్రి విజ్ఞప్తి చేశారు. బ్రెజిల్ మరియు కొలంబియా వంటి పొరుగు దేశాలు కూడా ఈ దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, హింసను వీడి దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరాయి. అయితే, అమెరికా మిత్రదేశమైన అర్జెంటీనా మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించింది. వెనిజులాలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు, డ్రగ్స్ మాఫియా అంతానికి ఇది అవసరమని అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ వ్యాఖ్యానించారు.
ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య, అమెరికా తన చర్యను సమర్థించుకుంటోంది. వెనిజులా నుంచి అమెరికాలోకి యథేచ్ఛగా సాగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడమే తమ ప్రధాన లక్ష్యమని వైట్ హౌస్ స్పష్టం చేసింది. నికోలస్ మదురోను పట్టుకోవడం ద్వారా ఒక నియంత పాలనకు ముగింపు పలికామని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, ఆర్థిక మార్కెట్లు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.






