బేడీలతో వెనుజుల అధ్యక్షుడు నికొలస్ మదురో.. యుద్ధనౌకపై నుంచి ట్రంప్ సంచలన పోస్ట్

by Malleboina Mahesh |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా (Truth Social) ఒక ఫోటోను షేర్ చేస్తూ, "నికోలస్ మదురో ప్రస్తుతం USS ఐవో జిమా (USS Iwo Jima) యుద్ధనౌకపై ఉన్నాడు" అని ప్రకటించారు.

బేడీలతో వెనుజుల అధ్యక్షుడు నికొలస్ మదురో.. యుద్ధనౌకపై నుంచి ట్రంప్ సంచలన పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా (Truth Social) ఒక ఫోటోను షేర్ చేస్తూ, "నికోలస్ మదురో ప్రస్తుతం USS ఐవో జిమా (USS Iwo Jima) యుద్ధనౌకపై ఉన్నాడు" అని ప్రకటించారు. ఈ చిత్రంలో మదురో బూడిద రంగు స్వెట్‌షర్ట్, స్వెట్‌ప్యాంట్స్ ధరించి, చేతులకు బేడీలతో (Handcuffs) కనిపిస్తున్నారు. అంతేకాకుండా, ఆయన కళ్లకు గంతలు (Sensory-deprivation goggles), చెవులకు హెడ్‌ఫోన్లు ఉన్నట్లు ఆ చిత్రం సూచిస్తోంది. కరాకస్‌పై శనివారం తెల్లవారుజామున అమెరికా జరిపిన మెరుపు దాడుల్లో మదురో దంపతులను అమెరికా దళాలు బందీలుగా పట్టుకున్న సంగతి తెలిసిందే. పోస్ట్ అనంతరం ట్రంప్ ఓ సందేశాన్ని విడుదల చేశారు.

అమెరికా సైనిక శక్తి ప్రదర్శన

ట్రంప్ ప్రకటన వెనిజులా రాజధాని కరాకస్‌లో అమెరికా సాయుధ దళాలు అత్యంత శక్తివంతమైన సైనిక ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైమానిక, భూతల, నౌకాదళాలను సమన్వయం చేస్తూ శనివారం తెల్లవారుజామున ఒక అద్భుతమైన దాడిని నిర్వహించామని ఆయన తెలిపారు. కరాకస్ నడిబొడ్డున ఉన్న అత్యంత పటిష్టమైన సైనిక కోటలను ధ్వంసం చేస్తూ.. నియంత నికోలస్ మదురోను న్యాయస్థానం ముందు నిలబెట్టడమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ అమెరికా సైనిక సామర్థ్యానికి, చరిత్రలో నిలిచిపోయే అత్యంత సమర్థవంతమైన శక్తి ప్రదర్శనకు నిదర్శనమని ట్రంప్ గర్వంగా వెల్లడించారు.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడి

ఈ సైనిక చర్యను రెండవ ప్రపంచ యుద్ధం నాటి దాడులతో పోల్చిన ట్రంప్, ఆధునిక చరిత్రలో ప్రజలు ఇలాంటి దాడిని ఎప్పుడూ చూసి ఉండరని వ్యాఖ్యానించారు. దేశ సరిహద్దులు దాటి డ్రగ్స్ మాఫియాను, నియంతృత్వాన్ని అణచివేయడానికి అమెరికా ఎంతటి సాహసానికైనా సిద్ధమని ఈ చర్య ద్వారా ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ప్రస్తుతం నికోలస్ మదురో అమెరికా దళాల అదుపులో ఉన్నారని, త్వరలోనే ఆయనపై అమెరికా చట్టాల ప్రకారం విచారణ జరుగుతుందని ప్రభుత్వం ధృవీకరించింది. ఈ పరిణామం లాటిన్ అమెరికా రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story