- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా హద్దులు దాటుతోంది : ట్రంప్ ప్రకటనపై స్పందించిన వెనెజువెలా
వెనెజువెలా దేశం.. తమ ఎయిర్ స్పేస్ ను మూసివేసినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: వెనెజువెలా దేశం.. తమ ఎయిర్ స్పేస్ ను మూసివేసినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై వెనెజువెలా స్పందించింది. తమదేశ ఎయిర్ స్పేస్ ను మూసివేసినట్లుగా ట్రంప్ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించింది. తమపై ట్రంప్ చేసిన పోస్ట్.. పూర్తిగా ఏకపక్ష చర్యను చూపిస్తోందని వాపోయింది. డ్రగ్ మాఫియాపై పోరాటం పేరుతో అమెరికా హద్దులు దాటుతోందని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని కించపరుస్తోందని ఒక ప్రకటనలో పేర్కొంది. వెనెజువెలా ప్రభుత్వాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా ట్రంప్ చర్యలు చేపడుతున్నారని ఆరోపించింది. తమపై అమెరికా దాడులు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో.. వెనెజువెలాకు విమాన సర్వీసుల్ని నిలిపివేసిన స్పెయిన్, పోర్చుగల్, కొలంబియా, చిలీ, బ్రెజిల్, తుర్కియే దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆయా దేశాలకు చెందిన విమాన సంస్థలపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న స్టేట్ టెర్రరిజంలో ఆయా విమానయాన సంస్థలు భాగస్వామ్యమైనట్లుగా మదురో సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసలేం జరిగిందంటే..
వెనెజువెలా గగనతలాన్ని మూసివేసినట్లుగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఏ క్షణంలోనైనా అమెరికా వెనెజువెలాపై దాడులు చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. రెండ్రోజుల క్రితమే ట్రంప్.. త్వరలోనే వెనెజువెలా భూభాగంపై ఆపరేషన్లు చేపడుతామని చెప్పడమే ఈ ఊహాగానాలకు కారణమైంది. సముద్రమార్గంలో ఆ దేశానికి భారీగా డ్రగ్స్ సప్లై అవుతున్నాయని పలుమార్లు ఆరోపించిన ట్రంప్.. డ్రగ్ మాఫియాకు వెనెజువెలా స్వర్గధామంగా మారిందని ఆరోపించారు. అంతటితో ఆగక.. తాజా ట్రూత్ సోషల్ లో.. వెనెజువెలా సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎయిర్ స్పేస్ ను పూర్తిగా మూసివేసినట్లుగా భావించాలంటూ పోస్ట్ పెట్టారు.






