- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించండి: సుప్రీంకోర్టు
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ తన పదవీకాలం ముగిసినప్పటికీ, దాదాపు ఎనిమిది నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా కేటాయించబడిన బంగ్లాలోనే ఉండటంతో వివాదాస్పదంగా మారింది.

దిశ,నేషనల్ బ్యూరో: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ తన పదవీకాలం ముగిసినప్పటికీ, దాదాపు ఎనిమిది నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా కేటాయించబడిన బంగ్లాలోనే ఉండటంతో వివాదాస్పదంగా మారింది. కృష్ణ మీనన్ మార్గ్‌లోని ఈ అధికారిక నివాసం నుంచి ఆయనను ఖాళీ చేయించాలని జులై 1న కేంద్ర గృహనిర్మాణ శాఖకు సుప్రీంకోర్టు లేఖ రాసింది. ఇప్పటికే ఆయన నెలకు రూ.5,430 లైసెన్స్ ఫీజు చెల్లిస్తూ ఏప్రిల్ 30 వరకు నివసించేందుకు అనుమతిని పొందారు. మే 31 వరకూ మరోసారి అనుమతి పొంది ఉండగా, ఇప్పుడు ఆ గడువు కూడా పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మరోసారి కేంద్ర మంత్రిత్వ శాఖకు లేఖ రాసి, ఆలస్యం లేకుండా బంగ్లాను స్వాధీనం చేసుకోవాలని కోరింది.
పదవీ విరమణ చేసి ఎనిమిది నెలలైనా..
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నవంబర్ 10, 2024న పదవీ విరమణ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రధాన న్యాయమూర్తి తన పదవీకాలంలో టైప్ 8 బంగ్లా లో ఉండేందుకు అర్హులు. పదవీ విరమణ తర్వాత మరో ఆరు నెలల వరకు అద్దె లేకుండా టైప్ 8 ప్రభుత్వ బంగ్లాలో ఉండొచ్చు. అయితే సుప్రీంకోర్టు లో మొత్తం 34 మంది సభ్యులతో కూడిన న్యాయమూర్తులు ఉండాలి. కానీ 33 మందే ఉన్నారు. అందులో ఇప్పటికీ ప్రభుత్వ బంగ్లాలు కేటాయించని వారు మరో నలుగురు ఉన్నారు. వీరిలో ముగ్గురు ట్రాన్సిట్ అపార్ట్ మెంట్లలో నివసిస్తున్నారు. మరొకరు స్టేట్ బంగ్లాలో ఉంటున్నారు.
వ్యక్తిగత కారణాలతోనే ఉన్నాను..
జస్టిస్ చంద్రచూడ్ ఈ ఆలస్యం వెనుక వ్యక్తిగత కారణాలే ఉన్నాయని నేషనల్ మీడియాతో వెల్లడించారు. తన కుమార్తెలకు ప్రత్యేక అవసరాలు ఉన్న నేపథ్యంలో తగిన వసతి దొరకకపోవడం వల్లే ఆలస్యం జరిగిందని తెలిపారు. చీఫ్ జస్టిస్ ఖన్నా, ప్రస్తుత చీఫ్ జస్టిస్ గవాయ్ లు ప్రధాన న్యాయమూర్తి ఉండాల్సిన ఇంట్లో ఉండకపోవడం వల్లే ఎనిమిది నెలలు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఉండటం సాధ్యపడినట్లు తెలుస్తోంది. అయితే తనకు ప్రభుత్వం తాత్కాలికంగా కేటాయించిన ఇల్లు మరమ్మతుల్లో ఉండటంతో అక్కడ నివసించలేకపోయానని అన్నారు. మరమ్మతులు కొనసాగుతున్నాయని పూర్తి కాగానే అందులోకి వెళ్లిపోతానని ఆయన తెలిపారు.






