ఇరాన్ యుద్ధ నౌకపై యూఎస్ దాడి.. విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2026-03-07 10:58:17  IST  )

శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌక 'ఐరిస్ దేనా' (IRIS Dena)ను అమెరికా జలాంతర్గామి ముంచేసిన ఘటన, అలాగే కొచ్చిలో మరో ఇరాన్ నౌకకు ఆశ్రయం కల్పించడంపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్ యుద్ధ నౌకపై యూఎస్ దాడి.. విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌక 'ఐరిస్ దేనా' (IRIS Dena)ను అమెరికా జలాంతర్గామి ముంచేసిన ఘటన, అలాగే కొచ్చిలో మరో ఇరాన్ నౌకకు ఆశ్రయం కల్పించడంపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాాజాగా జరిగిన రైసీనా డైలాగ్ 2026 లో ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం మానవత్వానికి సంబంధించిన విషయమని, ఇరాన్ నౌకకు ఆశ్రయం కల్పించడంలో భారత్ సరైన నిర్ణయమే తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు వచ్చిన ఇరాన్ యుద్ధ నౌకలు అనుకోని విధంగా ఉద్రిక్తతల వలయంలో చిక్కుకున్నాయని జైశంకర్ తెలిపారు. వాస్తవానికి ఆ నౌకలకు యుద్ధంలో పాల్గొనే ఉద్దేశం లేకపోయినప్పటికీ, ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల కారణంగా అవి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు.

కొచ్చిలో 'ఐరిస్ లావన్'కు ఆశ్రయం..

ఫ్లీట్ రివ్యూ అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో 'ఐరిస్ లావన్' (IRIS Lavan) అనే మరో ఇరాన్ నౌకలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ నౌకను అత్యవసరంగా నిలిపేందుకు అనుమతివ్వాలని ఇరాన్ ప్రభుత్వం కోరింది. దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం.. కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ, మానవతా దృక్పథంతో ఈ నెల 1వ తేదీన కొచ్చిలో నౌకను నిలిపేందుకు అనుమతి మంజూరు చేసింది. అనంతరం ఈ నెల 4న ఆ నౌక కొచ్చి పోర్టుకు చేరుకోగా, అందులోని 183 మంది సిబ్బందికి అక్కడే ఆశ్రయం కల్పించినట్లు జైశంకర్ వెల్లడించారు. ఇరాన్ నౌకకు ఆశ్రయం ఇవ్వడంపై జైశంకర్ మాట్లాడుతూ.. ‘మేము సమస్యల్లో ఉన్నాం, పోర్టుకు తిరిగి వస్తామని ఇరాన్ నౌక నుంచి మాకు సందేశం వచ్చింది. దానికి మేము వెంటనే అంగీకరించాం. ఇబ్బందుల్లో ఉన్నామని చెబితే సాయం చేయడం మానవత్వానికి సంబంధించిన విషయం.. ఈ విషయంలో మేం సరైన పనే చేశామని అనుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. భారత్ ఎప్పుడూ ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం (UNCLOS) , అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉంటుందని, ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం మన బాధ్యతని ఆయన వెల్లడించారు.

ఇరాన్ అధ్యక్షుడి క్షమాపణలు.. లొంగుబాటుపై కీలక ప్రకటన

Next Story