- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బిగ్ బ్యూటీఫుల్ బిల్లు’ కు ట్రంప్ ఆమోదం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన నూతన ఆర్థిక చట్టం ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ చట్టంగా మారింది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన నూతన ఆర్థిక చట్టం ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ చట్టంగా మారింది. పన్ను తగ్గింపులు, ప్రభుత్వ వ్యయాల నియంత్రణ వంటి మార్గాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ బిల్లుపై ట్రంప్ అధికారికంగా సంతకం చేశారు. చట్టబద్ధతను పొందిన ఈ బిల్లును రిపబ్లికన్ పార్టీ సభ్యులు, నైతికంగా ప్రభుత్వ నిధుల వినియోగాన్ని సమర్థించే వర్గాలు హర్షాతిరేకాలతో స్వాగతించాయి. ఈ బిల్లు ఆమోద దశలోనే తీవ్ర చర్చలకు దారి తీసింది. సెనెట్‌లో ముగ్గురు రిపబ్లికన్లు వ్యతిరేకించినప్పటికీ, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ట్రై బ్రేకింగ్ ఓటుతో 51-50 తేడాతో బిల్లు ఆమోదం పొందింది. అనంతరం ప్రతినిధుల సభలో 218 మంది సభ్యులు అనుకూలంగా, 214 మంది వ్యతిరేకంగా ఓటు వేయగా, ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించడంతో గట్టి పోటీ మధ్య బిల్లు ఆమోదం పొందింది.
సాయుధ దళాలకు ఉపయుక్తంగా..
చట్టంపై స్పందించిన ట్రంప్, ఇది దేశ ప్రజలందరికీ లాభదాయకమవుతుందని పేర్కొన్నారు. రోజువారీ కార్మికులు నుంచి సాయుధ దళాల వరకు ఈ చట్టం మద్దతుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. దేశ చరిత్రలోనే సరిహద్దు భద్రత కోసం భారీ పెట్టుబడి ఇదేనని ట్రంప్ వెల్లడించారు. ఈ సందర్భంగా స్పీకర్ మైక్ జాన్సన్, సెనేట్ మెజారిటీ నేత జాన్ థున్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పండగలా నిర్వహించారు. ట్రంప్ మద్దతుదారులు, మిలిటరీ కుటుంబాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గగనతలంలో అమెరికా స్టెల్త్ బాంబర్లు, యుద్ధ విమానాలు ప్రదర్శన ఇస్తూ ఈ వేడుకను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఈ చట్టంతో ప్రభుత్వ వ్యయాన్ని భారీగా కట్టడి చేయడం, వలస నియంత్రణకు కొత్త నిబంధనలకు ,నిధులు కేటాయించడం, పన్ను తగ్గింపులను శాశ్వతంగా చేయడం లాంటి కీలక అంశాలు ఉన్నాయి. ఈ చర్యల వల్ల లక్షలాది మంది ఆరోగ్య బీమా సదుపాయాలను కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.






