మరోసారి ఆస్ట్రేలియాలో కాల్పుల మోత.. ముగ్గురి మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

by Ramesh Naini |

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో గురువారం ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

మరోసారి ఆస్ట్రేలియాలో కాల్పుల మోత.. ముగ్గురి మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో గురువారం ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. సిడ్నీకి పశ్చిమంగా సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'లేక్ కార్గెల్లిగో' (Lake Cargelligo) అనే చిన్న పట్టణంలో ఈ దారుణం జరిగింది. సుమారు 1,500 మంది జనాభా ఉన్న ఈ ప్రశాంతమైన పట్టణం ఒక్కసారిగా తుపాకీ శబ్దాలతో దద్దరిల్లింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. కాల్పుల సమాచారం అందగానే అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉన్నారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

పరారీలో దుండగులు.. పోలీసుల హెచ్చరిక

కాల్పులకు తెగబడిన దుండగులు ఇంకా పట్టుబడలేదు. వారు పట్టణంలోనే ఎక్కడో నక్కి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, తలుపులు మూసుకోవాలని హెచ్చరించారు. ఘటనా స్థలానికి సమీప ప్రాంతాలకు రావద్దని సూచిస్తూ జియో-టార్గెటెడ్ టెక్స్ట్ మెసేజ్‌లు పంపారు. పట్టణం మొత్తం పోలీసు బలగాలు, అంబులెన్స్‌లతో నిండిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆందోళనలో అధికార యంత్రాంగం

గత ఏడాది డిసెంబర్ 14న సిడ్నీలో జరిగిన హనుక్కా వేడుకల్లో 15 మంది మృతి చెందిన ఘటనను గుర్తు చేసుకుంటూ ఆస్ట్రేలియా నేడు 'జాతీయ సంతాప దినం' (National Day of Mourning) పాటిస్తోంది. సరిగ్గా అదే వారంలో మళ్లీ ఇలాంటి ఘోరం జరగడం అధికారులను విస్మయానికి గురిచేసింది. గతంలో బోండీ బీచ్‌లో జరిగిన దాడుల దృష్ట్యా, పోలీసులు ఉగ్రవాద కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.

Next Story