శ్రీలంక తీరంలో ఇరాన్‌ నౌకపై సబ్‌మెరైన్‌ దాడి.. 101 మంది గల్లంతు

by Ramesh Naini |   (  Updated:2026-03-04 10:47:26  IST  )

ఇరాన్‌కు చెందిన ఒక నౌకపై సబ్‌మెరైన్ (జలాంతర్గామి) ద్వారా దాడి జరగడంతో ఆ నౌక సముద్రంలో మునిగిపోయింది.

శ్రీలంక తీరంలో ఇరాన్‌ నౌకపై సబ్‌మెరైన్‌ దాడి.. 101 మంది గల్లంతు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇజ్రాయెల్- అమెరికా కుటమి ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతల వేళ శ్రీలంక దక్షిణ తీరంలో పెను ప్రకంపనలు సృష్టించే ఘటన చోటుచేసుకుంది. ఇరాన్‌కు చెందిన ఒక నౌకపై సబ్‌మెరైన్ (జలాంతర్గామి) ద్వారా దాడి జరగడంతో ఆ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 101 మంది సిబ్బంది గల్లంతైనట్లు శ్రీలంక నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. మరో 78 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. శ్రీలంకలోని గాలె నగర సమీపంలో దక్షిణ తీరానికి కొద్ది దూరంలో బుధవారం ఈ దాడి జరిగింది. సముద్రంలో ప్రయాణిస్తున్న ఇరాన్ నౌక నుంచి ఆపదలో ఉన్నట్లు (Distress call) సంకేతాలు అందడంతో శ్రీలంక నేవీ వెంటనే రంగంలోకి దిగింది. నౌక వేగంగా మునిగిపోతున్న తరుణంలో సహాయక బృందాలు అక్కడికి చేరుకుని ఇప్పటి వరకు 30 మందిని సురక్షితంగా రక్షించాయి.

సబ్‌మెరైన్‌తో ఈ దాడి ఎవరు చేశారు?

ఈ ఘటనపై శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత్ హేరత్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. మునిగిపోతున్న నౌక నుంచి కనీసం 30 మందిని రక్షించినట్లు ధ్రువీకరించారు. అయితే దాడికి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించని ఆయన, ఈ విషయంలో శ్రీలంక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కాగా, గాయపడిన 78 మందిని చికిత్స నిమిత్తం గాలెలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన 101 మంది కోసం శ్రీలంక నౌకాదళం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. సబ్‌మెరైన్‌తో ఈ దాడి ఎవరు చేశారు? ఏ కారణంతో చేశారు? అనే విషయాలపై ప్రస్తుతం స్పష్టత లేదు. అంతర్జాతీయ సముద్ర జలాల్లో జరిగిన ఈ దాడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Next Story