ఉగ్రవాదులు యువతిని నగ్నంగా ఊరేగించిన ఫొటోకు అవార్డు

by Dishanational4 |
ఉగ్రవాదులు యువతిని నగ్నంగా ఊరేగించిన ఫొటోకు అవార్డు
X

దిశ, నేషనల్ బ్యూరో : గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రదాడి చేసి వందలాది మంది యూదులను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఆ టైంలోనే ఇజ్రాయెల్‌కు చెందిన 22 ఏళ్ల షానీ లౌక్ అనే యువతిని బంధించి, అర్ధనగ్న స్థితిలో ట్రక్కుపై హమాస్ ఉగ్రవాదులు ఊరేగించారు. దానికి సంబంధించిన ఓ ఫొటోకు తాజాగా ప్రతిష్టాత్మక జర్నలిజం అవార్డు లభించింది. అమెరికాలోని మిస్సోరీ స్కూల్ ఆఫ్ జర్నలిజం పరిధిలో పనిచేసే ‘డొనాల్డ్ డబ్ల్యూ రేనాల్డ్స్ జర్నలిజం ఇన్‌స్టిట్యూట్’ ఈ అవార్డును ప్రకటించింది. ‘టీమ్ పిక్చర్ స్టోరీ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఆ ఫొటోను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ ఫొటోను అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థకు చెందిన ఫొటోగ్రాఫర్ సాహసోపేతంగా తీశారని తెలిపింది. హమాస్ ఉగ్రవాదులు తుపాకులతో రెచ్చిపోతున్న ఆనాటి పరిస్థితుల్లోనూ ప్రాణాలను లెక్క చేయకుండా ఆ అరాచకాన్ని ప్రజల ముందుకు తెచ్చిన ఘనత సదరు ఫొటోగ్రాఫర్‌దే అని కొనియాడింది.

మరో వాదన..

ఈవిధంగా మహిళలు దయనీయ స్థితిలో ఉన్న ఫొటోలు తీయడం జర్నలిజం ప్రమాణాలకు తగదనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఫొటో తీసినందుకు సదరు ఫొటోగ్రాఫర్‌కు జైలుశిక్ష విధించాలని ఐక్యరాజ్యసమితిలోని ఇజ్రాయెల్ మిషన్‌లో స్పీచ్ రైటింగ్ విభాగం మాజీ అధిపతి అవివా క్లోంపాస్ డిమాండ్ చేశారు. కాగా, షానీ లౌక్ గాజాలో దారుణ స్థితిలో చనిపోయిందని అక్టోబర్ 30న వెల్లడైంది. ఆమె డెడ్ బాడీ నేటికీ గాజాలోనే ఉందని అంటున్నారు.


Next Story

Most Viewed