మా ఈమెయిళ్లు హ్యాకయ్యాయి, ఇది 'ఇరాన్' పనే..! డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం

by Geesa Chandu |

అమెరికాలో ఈ ఏడాది నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దాంట్లో భాగంగానే అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు.

మా ఈమెయిళ్లు హ్యాకయ్యాయి, ఇది ఇరాన్ పనే..! డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో ఈ ఏడాది నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దాంట్లో భాగంగానే అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఇంతలోనే ట్రంప్ కు చెందిన కొన్ని అంతర్గత సందేశాలు హ్యాక్ కి గురైనట్లు వార్తలు వచ్చాయి. ఈ హ్యాకింగ్ కి పాల్పడింది ఇరాన్ అని ట్రంప్ ప్రచార బృందం వెల్లడించింది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి ఋజువులను వారు అందించలేకపోయారు. అమెరికాలోని ఒహియో సెనేటర్ జేడీ వాన్స్ పై నిర్వహించిన అంతర్గత పరిశోధనతో సహా.. ప్రచార పత్రాలను ఈమెయిల్ పంపినట్లు ఓ అమెరికన్ న్యూస్ వెబ్సైట్ శనివారం తెలిపింది. ఈ నివేదికలో వాన్స్ కు చెందిన గత రికార్డులు, స్టేట్మెంట్లు సహా.. మొత్తం 271 పేజీల సమాచారం ఉన్నట్లు పొలిటికో వెబ్సైట్ పేర్కొంది. కాగా ట్రంప్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే 2024 అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడమే ఈ పత్రాల ఉద్దేశమని ట్రంప్ ప్రచార బృందం ప్రతినిధి ఒకరు ఈ సందర్భంలో తెలిపారు.

వివరాల్లోకెళ్తే.. అమెరికా అధ్యక్ష అభ్యర్ధి ప్రచారాన్ని ఇరాన్ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని.. మైక్రోసాఫ్ట్ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక వచ్చిన ఒక రోజు తర్వాత ట్రంప్ ప్రచార బృందం నుండి ఈ ప్రకటన వచ్చింది. ఆ నివేదికలో.. మైక్రోసాఫ్ట్ థ్రెట్ అనాలసిస్ సెంటర్ (MTAC) గత కొన్ని నెలలుగా ఇరాన్ కార్యకలాపాలను గమనించినట్లు తెలిపింది. అయితే ఇంత తక్కువ సమయంలో హ్యాకింగ్ చేయటం, జేడీ వాన్స్ ఎంపిక అంశాలు మొదలైనవి.. మైక్రోసాఫ్ట్ థ్రెట్ అనాలసిస్ సెంటర్ నివేదికలో వివరించిన ఈమెయిల్ కు అనుగుణంగానే ఉన్నాయని.. అందువల్లే ఈ పని చేసింది ఇరాన్ అని మేము నిర్ధారణకు వచ్చినట్లు ట్రంప్ ప్రచార ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ వెల్లడించారు.

Next Story