భార్య వివాహేతర సంబంధం! ఇద్దరు బిడ్డలను కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్న అధికారి

by Ramesh Naini |

భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి తన ఇద్దరు కన్నబిడ్డలను తుపాకీతో కాల్చి చంపి, అనంతరం తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

భార్య వివాహేతర సంబంధం! ఇద్దరు బిడ్డలను కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్న అధికారి
X

దిశ, డైనమిక్ బ్యూరో : బ్రెజిల్‌లోని ఇటుంబియారా నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి తన ఇద్దరు కన్నబిడ్డలను తుపాకీతో కాల్చి చంపి, అనంతరం తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. నెట్టింట వార్త వైరల్‌గా మారింది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఇటుంబియారా మున్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న థేల్స్ నవేస్ అల్వెస్ మచాడో (40), అక్కడి మేయర్ డియోన్ అరౌజోకు స్వయానా అల్లుడు. గురువారం తెల్లవారుజామున 'కొండోమినియో పారైసో'లోని తన అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. నివాసం నుంచి తుపాకీ శబ్దాలు రావడంతో అప్రమత్తమైన పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.

ముందస్తు ప్రణాళికతోనే..?

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి బెడ్‌రూమ్‌లో థేల్స్ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. ఆయన ఛాతీపై తుపాకీ ఉంది. పక్కనే ఆయన ఇద్దరు కుమారులు తీవ్ర గాయాలతో పడి ఉన్నారు. పెద్ద కుమారుడు మిగ్యుల్ అరౌజో మచాడో (12) అప్పటికే మరణించగా, 8 ఏళ్ల చిన్న కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ దారుణానికి పాల్పడే ముందు థేల్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పిల్లలతో కలిసి ఉన్న ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో పిల్లలపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూనే, ‘ముక్కలైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’ అని క్యాప్షన్ ఇచ్చారు. తన భార్యకు మరొకరితో సంబంధం ఉందని, నిఘా కెమెరాల ద్వారా ఆ విషయాన్ని ధృవీకరించుకున్నానని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

భార్య సావో పాలో పర్యటనలో...

ఘటన జరిగిన సమయంలో ఆయన భార్య సావో పాలో పర్యటనలో ఉన్నారు. ఈ ఘటనపై గోయాస్ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. థేల్స్ మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి కుటుంబ సభ్యులు, పొరుగువారి వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. దాదాపు 15 ఏళ్ల వైవాహిక బంధం ఉన్న ఈ దంపతులు బయటకు ఎంతో అన్యోన్యంగా కనిపించేవారని, ఈ ఘటన తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా థేల్స్ భార్య ఒక గుర్తు తెలియని వ్యక్తికి ముద్దు పెడుతున్నట్లు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Next Story