కేరళలో నిఫా వైరస్ కలకలం.. మూడు జిల్లాలు అలర్ట్

by Shamantha N |   (  Updated:2025-07-04 08:02:34  IST  )

కేరళలో రెండు నిపా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఒకటి మలప్పురం జిల్లాలో, మరొకటి పాలక్కాడ్ జిల్లాలో నమోదు కాగా.. కోజికోడ్, మలప్పురం పాలక్కాడ్ మూడు జిల్లాల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు

కేరళలో నిఫా వైరస్ కలకలం.. మూడు జిల్లాలు అలర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలో రెండు నిపా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఒకటి మలప్పురం జిల్లాలో, మరొకటి పాలక్కాడ్ జిల్లాలో నమోదు కాగా.. కోజికోడ్, మలప్పురం పాలక్కాడ్ మూడు జిల్లాల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మలప్పురం , కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లో నిర్వహించిన పరీక్షల నుంచి ప్రాథమికంగా నిర్థారణ కాగా.. తుది నిర్ధారణ కోసం నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. అధికారిక ఫలితాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, నివారణ చర్యలను వెంటనే కఠినతరం చేయాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. కాంటాక్ట్ ట్రేసింగ్, కంటైన్మెంట్ ప్లానింగ్, పబ్లిక్ కమ్యూనికేషన్‌తో సహా నిఫా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రతి జిల్లాలో మొత్తం 26 కమిటీలను ఏర్పాటు చేశారు.

అవసరమైతే కంటైన్మెంట్ జోన్లు

వైరస్ కాంటాక్ట్ జాబితాలను సిద్ధం చేయడంతో పాటు ఆంక్షలను అమలు చేయడానికి ప్రత్యేక పోలీసుల బృందాలను నియమించారు. అవసరమైతే కంటైన్మెంట్ జోన్‌లను ప్రకటించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర జిల్లా స్థాయిలో హెల్ప్‌లైన్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇన్ఫెక్షన్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి వీణా జార్జ్ చెప్పారు. మే ప్రారంభంలో మలప్పురం జిల్లాలో నిపా వైరస్ కేసు నిర్ధారణ అయింది. వాలంచెరి మునిసిపాలిటీ ప్రాంతంలో నివసిస్తున్న 42 ఏళ్ల వ్యక్తికి నిఫా వైరస్ పాజిటివ్ అని తేలింది. నెల తర్వాత, రోగికి వరుసగా రెండు నమూనాలలో నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి మళ్లీ నిఫా వైరస్ కలకలంతో కేరళ అధికారులు అప్రమత్తమయ్యారు.

Next Story