వాషింగ్టన్ డీసీకి ఉన్నట్టుండి ‘నైట్ వాచ్’ ఫ్లైట్

by Shamantha N |

ఇరాన్, ఇజ్రాయిల్ ఉద్రిక్తతల వేళ అమెరికాలోని ప్రధాన నగరం వాషింగ్టన్ డీసికి ‘నైట్ వాచ్’ ఫ్లైట్ డూమ్స్ డే విమానం చేరుకోవడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

వాషింగ్టన్ డీసీకి ఉన్నట్టుండి ‘నైట్ వాచ్’  ఫ్లైట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్, ఇజ్రాయిల్ ఉద్రిక్తతల వేళ అమెరికాలోని ప్రధాన నగరం వాషింగ్టన్ డీసికి ‘నైట్ వాచ్’ ఫ్లైట్ డూమ్స్ డే విమానం చేరుకోవడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా వాషింగ్టన్ మెరుపు దాడులకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పక్కా ప్లాన్ ప్రకారం ఇరాన్ పై దాడి చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అణ్వస్త్ర దాడి సమయంలో అమెరికా రక్షణ మంత్రి సహా కీలక అధికారులు అత్యధిక సమయం గాల్లో ఉండేందుకు నిర్మించిన ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ గా దీనికి పేరుంది. బోయింగ్ ఈ4 విమానాన్ని అమెరికా మంత్రులు, కీలక రక్షణ శాఖ అధికారులను రక్షించేందుకు నిర్మించారు. ‘నేషనల్‌ ఎమర్జెన్సీ ఎయిర్‌బార్న్‌ కమాండ్‌ పోస్ట్‌’ ప్రోగ్రాం కింద దీన్ని తయారు చేయగా నైట్ వాచ్ గా పిలుస్తారు. అమెరికా వద్ద ఇలాంటివి మరో నాలుగు ఉన్నాయి. వారం పాటు ఆకాశంలోనే విహరించగల సామర్థ్యం ఏకదాటిగా 7 వేల మైళ్లు ప్రయాణించగలదు. ఒక సారి రీప్యూయిలింగ్ చేసుకుని గగనతలంలో వారం రోజుల పాటు ఉండొచ్చు. కాగా ఇప్పటి వరకు 35 గంటలకు పైగా గాల్లో ఉన్న రికార్డు దీని పేరిట ఉంది.

ప్రత్యేకతలు ఇవే

అణ్వస్త్ర దాడులను కూడా తట్టుకునే శక్తి ఈ ఫ్లయింగ్ ఫ్లైట్ కు ఉంది. సైబర్ దాడులు, ఎలక్ట్రోమాగ్నెటిక్‌ ఎఫెక్ట్‌ను తట్టుకుంటుంది. థర్మల్‌, న్యూక్లియర్‌ షీల్డింగ్ లు అమర్చగా.. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా.. ఎవరితోనే అయినా దీనిలోని కమ్యూనికేషన్లు వాడి మాట్లాడవచ్చు. 67 శాటిలైట్‌ డిష్‌లు, యాంటినాలతో పాటు శత్రువుపై దాడి చేసే సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. ‘నైట్‌వాచ్‌’లోని మూడు అంతస్తులు ఉన్నాయి. బ్రీఫింగ్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, 18 బంకులు కలిగి ఉన్నాయి. దీన్ని ఫ్లయింగ్ పెంటగాన్ అని పిలుస్తారు. దీన్ని జార్జి బుష్ ఉన్నప్పుడు రక్షణ శాఖ మంత్రి ఎక్కువగా వాడారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని అమెరికా హెచ్చరిస్తున్న వేళ తలొగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తేల్చి చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాజాగా ఈ విమానం లూసియానాలోని బోస్పియర్ నుంచి బయల్దేరి మేరీల్యాండ్ లోని జాయింట్ బేస్ అండ్రూస్ కు చేరుకొంది.

Next Story