ట్రంప్ వద్ద మోడీ తలవంచుతాడు: రాహుల్ గాంధీ

by Shamantha N |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 26 శాతం పరస్పర టారిఫ్‌లు అమలులోకి రావడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ వద్ద మోడీ తలవంచుతాడు: రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 26 శాతం పరస్పర టారిఫ్‌లు అమలులోకి రావడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఆ డెడ్‌లైన్‌కు ముందు కచ్చితంగా ట్రంప్ వద్ద తల వంచుతారని ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్ గా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ భారత్‌ స్వప్రయోజనాలను కాపాడే విధంగానే అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని చెప్పారు. జులై 9కు ముందే రెండు దేశాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సమాచారం.

కొనసాగుతున్న చర్చలు

ఈ టారిఫ్ వివాదం మొదలైనప్పటి నుంచి రెండు దేశాల మధ్య వివిధ అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా డెయిరీ, వ్యవసాయ రంగాల్లోకి భారత మార్కెట్ ప్రవేశానికి ఒత్తిడి తెస్తున్నప్పటికీ, భారత్‌ తన స్థానిక వ్యవసాయ, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాల కోసం టారిఫ్ తగ్గించడానికి నిరాకరిస్తోంది. ఇదే సమయంలో భారత్‌ కార్మికాధారిత రంగాలు టెక్స్ టైల్, ఆభరణాలు, లెదర్‌, కెమికల్స్ వంటివాటిలో అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశానికి అవకాశం కోరుతోంది.

వాణిజ్య ప్రతినిధి రాజేశ్ అగర్వాల్ నేతృత్వంలో చర్చలు

వాషింగ్టన్‌లో భారత వాణిజ్య ప్రతినిధి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం చర్చల కోసం తమ పర్యటనను పొడిగించినప్పటికీ, ఇంకా చాలా సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ఓ వ్యాపార సమావేశంలో మాట్లాడిన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్.. ‘భారత్ ఎప్పుడూ డెడ్‌లైన్‌ల ఆధారంగా ఒప్పందాలు కుదుర్చుకోదు. రైతులు, డెయిరీ రంగ ప్రయోజనాలు కాపాడే విధంగా, పరస్పర లాభదాయకమైన ఒప్పందం అయితేనే ముందుకు సాగుతాం’ అని స్పష్టం చేశారు.

Next Story