Iran warns: అమెరికా లొంగిపోయే వరకు యుద్ధం ఆగదు: ఇరాన్ హెచ్చరిక

by Ramesh Naini |

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది.

Iran warns: అమెరికా లొంగిపోయే వరకు యుద్ధం ఆగదు: ఇరాన్ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. తమ శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్‌లు అవమానభారంతో కుంగిపోయి, పూర్తిగా లొంగిపోయే వరకు ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాబోయే వారాల్లో ఇరాన్‌ను బాంబులతో దాడులు చేసి ‘శిలాయుగం’లోకి నెట్టేస్తామన్న ట్రంప్ హెచ్చరికలకు ప్రతిగా.. అమెరికా, ఇజ్రాయెల్‌లపై మరింత తీవ్రమైన, విధ్వంసకరమైన దాడులు చేస్తామని ఇరాన్ సైనిక కమాండ్ (ఖతం అల్-అన్బియా) ప్రకటించింది. శత్రువు పశ్చాత్తాపపడేలా తమ దాడులు ఉంటాయని హెచ్చరించింది.

మా సైనిక సామర్థ్యం దెబ్బతినలేదు..

ఇరాన్ అణు, క్షిపణి వ్యవస్థల సామర్థ్యాన్ని తమ దాడుల ద్వారా గణనీయంగా తగ్గించేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చింది. తమ సైనిక సామర్థ్యం ఏమాత్రం దెబ్బతినలేదని తేల్చిచెప్పింది. గత నెల రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌కు అమెరికా కూడా తోడుకావడంతో పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధ భయాలు నెలకొన్నాయి. అయితే, తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికే తాము ప్రతిదాడులకు దిగుతున్నట్లు ఇరాన్ సమర్థించుకుంటోంది. ప్రస్తుతానికి ఇరాన్ సైన్యం చేసిన ఈ తాజా హెచ్చరికలపై అమెరికా లేదా ఇజ్రాయెల్ అధికారుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. ఆ ప్రాంతంలో మాత్రం ఇరు పక్షాలు సైనిక మోహరింపులు పెంచడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story