- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాన్సర్ చికిత్సపై వీడియోగేమ్ రూపంలో వివరణ.. గ్లోబల్ సైన్స్ పోటీ ఫైనల్స్‌లో భారత విద్యార్థిని
భారతదేశానికి చెందిన ఓ యువ విద్యార్థిని అంతర్జాతీయ స్థాయి 'బ్రేక్‌త్రూ జూనియర్ ఛాలెంజ్' ..

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశానికి చెందిన ఓ యువ విద్యార్థిని అంతర్జాతీయ స్థాయి 'బ్రేక్‌త్రూ జూనియర్ ఛాలెంజ్' పోటీలో టాప్-16 ఫైనలిస్టుల్లో స్థానం సంపాదించారు. క్యాన్సర్ చికిత్సలో వినూత్నంగా ఉపయోగపడే 'కార్-టీ సెల్ థెరపీ' (CAR-T Cell Therapy)ని సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వీడియో గేమ్ ఫార్మాట్‌లో తయారు చేయడం ద్వారా ఆమె ఈ ఘనత సాధించారు.
బెంగళూరు నివాసి అయిన ఇసాబెల్ షిజు ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్నారు. గతంలో తనకు తెలిసిన ఓ వ్యక్తి కీమోథెరపీ చికిత్స పొందుతున్న సమయంలో ఆమె దాన్ని దగ్గరగా పరిశీలించారు. అలాంటి చికిత్సలు ఎంత కష్టతరమో ఆమెకు తెలిసింది. వైద్యవిద్య చదువుతున్న తన సోదరి ద్వారా కార్-టీ సెల్ థెరపీ గురించి తెలుసుకున్న షిజు.. ఈ పద్ధతిలో రోగి స్వంత రోగనిరోధక కణాలను జన్యురూపంలో మార్చి క్యాన్సర్ కణాలతో పోరాడేలా చేస్తారని గ్రహించారు. శరీర స్వంత రోగనిరోధక వ్యవస్థను క్యాన్సర్‌పై ప్రయోగించడం తనను బాగా ఆకట్టుకుందని ఆమె పేర్కొన్నారు. దీనిపై లోతుగా అధ్యయనం చేసి, సామాన్యులకు సులభంగా తెలిసేలా వీడియో గేమ్ శైలిలో ఒక వీడియోను రూపొందించారు.
ఎంతో కష్టమైన ఈ అంశాన్ని కేవలం రెండు నిమిషాల్లో వివరించడం చాలా సవాలుగా మారిందని, మూడు నెలల పాటు సుమారు 40 స్క్రిప్ట్‌లు రాసి పరిశీలించానని ఆమె వెల్లడించారు.'బ్రేక్‌త్రూ జూనియర్ ఛాలెంజ్'ను 2015లో ప్రముఖ శాస్త్రవేత్త యూరీ మిల్నర్ ప్రారంభించారు. ఇది అంతర్జాతీయ సైన్స్ వీడియో పోటీగా, క్లిష్టమైన శాస్త్రీయ విషయాలను సృజనాత్మకంగా వివరించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. ఈ పోటీలో విజేతకు స్కాలర్‌షిప్‌లు, వారి స్కూల్‌కు పూర్తి సదుపాయాలతో కూడిన సైన్స్ ల్యాబ్ ఏర్పాటు సహా మొత్తం 4 లక్షల డాలర్లు (సుమారు రూ.3.59 కోట్లు) విలువైన బహుమతులు అందజేస్తారు. ఈ సంవత్సరం టాప్-16 అంతర్జాతీయ ఫైనలిస్టుల్లో భారత్ నుంచి ఏకైక ప్రతినిధిగా షిజు స్థానం దక్కించుకున్నారు. విజేతను రానున్న రోజుల్లో ప్రకటించనున్నారు.






