‘ఇకపై మంచివాడిగా ఉండను’.. ట్రూత్ వేదికగా ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

by Ramesh Naini |

తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ (Truth Social)’ వేదికగా ఇరాన్‌కు ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

‘ఇకపై మంచివాడిగా ఉండను’.. ట్రూత్ వేదికగా ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. అణు ఒప్పందం, హార్ముజ్ జలసంధి మూసివేతపై ఇరాన్ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు బుధవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ (Truth Social)’ వేదికగా ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ‘ఇరాన్‌కు అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో తెలియడం లేదు. వారు ఇకనైనా తెలివిగా వ్యవహరిస్తే మంచిది’ అని ట్రంప్ హితవు పలికారు. చేతిలో ఆటోమేటిక్ రైఫిల్ పట్టుకుని, వెనుక భారీ పేలుళ్లు జరుగుతున్నట్లుగా ఉన్న తన ఎడిటెడ్ ఏఐ ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఇకపై నేను మంచివాడిగా ఉండను (No More Mr. Nice Guy)’ అని క్యాప్షన్ జత చేశారు. ఇరాన్ ప్రతిపాదించిన ఒప్పందంలో అణు కార్యక్రమాల ప్రస్తావన లేకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.

హార్ముజ్ జలసంధి వివాదం

ఫిబ్రవరి చివర్లో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్.. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో (దాదాపు 20%) కీలకమైన హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కుదుపులకు లోనైంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా జలసంధిలో తగిన చర్యలు తీసుకునే హక్కు తమకుందని, నావికా స్వేచ్ఛకు సంబంధించిన 1982 నాటి ఐరాస సముద్ర జలాల ఒప్పందం (UN Convention on the Law of the Sea) తమకు వర్తించదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకునేందుకు అమెరికా నావికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తోంది. అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరుకుందని ట్రంప్ పేర్కొన్నారు. తమ వ్యూహంతో ఇరాన్‌లో ద్రవ్యోల్బణం పెరిగిందని, చమురు నిల్వ సామర్థ్యం తగ్గిపోయి త్వరలోనే ఉత్పత్తిని నిలిపివేయాల్సిన దుస్థితి ఇరాన్‌కు వస్తుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. శాంతి ఒప్పందానికి అంగీకరించే వరకు ఈ దిగ్బంధనం కొనసాగుతుందని, దీనికోసం సిద్ధంగా ఉండాలని ట్రంప్ తన అధికారులను ఆదేశించారు.

ఇరాన్ ప్రతీకార హెచ్చరికలు

అమెరికా చర్యలపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) నావికాదళం దీటుగా స్పందించింది. అమెరికా ఏవైనా తప్పుడు అంచనాలతో దుస్సాహసానికి పాల్పడితే తమ ‘సర్‌ప్రైజ్ వ్యూహాలు (Surprise tactics)’ రుచిచూడాల్సి వస్తుందని హెచ్చరించింది. సరికొత్త ‘స్మార్ట్ టార్గెటింగ్’ టెక్నాలజీతో అమెరికా భారీ నౌకలను బూడిద చేస్తామని IRGC నేవీ విభాగం ప్రతి దాడికి సంసిద్ధతను వ్యక్తపరిచింది. సముద్ర మార్గాలపై ఆంక్షలు తొలగించేంత వరకు చర్చలకు తావులేదని ఇరాన్ భీష్మించుకు కూర్చోగా, శాంతి ఒప్పందం కుదిరే వరకు దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా స్పష్టం చేస్తుండటంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి.

Next Story