హిందీ వివాదం.. ఒక్కటైన ఠాక్రేల ఫ్యామిలీ

by Shamantha N |

జాతీయ విద్యా విధానాన్ని (NEP) అనుసరించి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరిగా బోధించాలన్నమహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే – UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేవా (MNS) నేత రాజ్ ఠాక్రే తొలిసారిగా ఒకే వేదికపై ఒక్కటి కాబోతున్నారు.

హిందీ వివాదం.. ఒక్కటైన ఠాక్రేల ఫ్యామిలీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ విద్యా విధానాన్ని (NEP) అనుసరించి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరిగా బోధించాలన్నమహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే – UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేవా (MNS) నేత రాజ్ ఠాక్రే తొలిసారిగా ఒకే వేదికపై ఒక్కటి కాబోతున్నారు. మహాారాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని స్థానిక భాషా విశిష్టతపై దాడిగా భావిస్తూ ఈ ఇద్దరూ కలిసి జులై 5న వర్లీలో ఐక్యంగా నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. ఇరవై సంవత్సరాలలో ఈ ఇద్దరి కలిసి చేస్తున్న సంయుక్త ఉద్యమం కావడం గమనార్హం.

నిరసనలకు వేర్వేరుగా పిలుపునిచ్చి ఒక్కటై..

ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే వేర్వేరు రోజుల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. రాజ్‌ ఠాక్రే జులై 6న 'విరాట్ మోర్చా' చేపట్టనున్నట్టు ప్రకటించగా, ఉద్ధవ్‌ ఠాక్రే జులై 7న ఆందోళన చేపట్టనున్నట్లు తెలియజేశారు. అయితే, శివసేన (UBT) నేత సంజయ్ రౌత్‌ ఇద్దరినీ కలిపి చర్చలు జరిపిన తర్వాత ఈ రెండు పార్టీలు ఒకే వేదికపై ఆందోళన నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఇరుపక్షాల నేతలు సమావేశమై వ్యూహాలు రూపొందించారు. (MNS) ముఖ్యనేత సందీప్ దేశ్‌పాండే మాట్లాడుతూ... ఈ ఐక్యత మహారాష్ట్ర రాజకీయాలలో ఓ కీలక మలుపు కాబోతుందని ఇది మరాఠీ ప్రజాశక్తిని చాటే అవకాశం అని తెలిపారు.

నగరపాలక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే..

ఈ అంశంపై అధికార పక్షం, శివసేన (ఏక్‌నాథ్ షిండే ) బీజేపీ నేతలు స్పందిస్తూ ఇది రానున్న నగర పాలక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రదర్శిస్తున్న ‘రాజకీయ డ్రామా’ అని విమర్శించారు. హిందీని ఎవరూ తప్పనిసరి చేయలేదని, అన్ని పాఠశాలల్లో మరాఠీ తప్పనిసరిగా బోధించబడుతుందని, హిందీ భాష ఐచ్ఛికంగా మాత్రమే అందుబాటులో ఉందని వారు స్పష్టం చేశారు.

ముంబై ట్రాఫిక్ పోలీసుల సలహా

జులై 5, 2025న వర్లీ డోమ్ వేదికగా మధ్యాహ్నం 2:00 గంటల వరకు జరగనున్నఈ భారీ ర్యాలీ నేపథ్యంలో ముంబై ట్రాఫిక్ పోలీసులు ఓ ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. భారీ ర్యాలీ కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నారు.

Next Story