- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్లోరిడా ఎయిర్‌పోర్టుకు డొనాల్డ్ ట్రంప్ పేరు.. బిల్లుకు స్థానిక చట్టసభ ఆమోదం!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గౌరవార్థం ఫ్లోరిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలని రాష్ట్ర చట్టసభ నిర్ణయించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఫ్లోరిడాలోని ఒక ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలని ఆ రాష్ట్ర చట్టసభ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ‘పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ పేరును ఇకపై ‘ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’గా మార్చే ప్రతిపాదిత బిల్లుకు గురువారం (ఫిబ్రవరి 19, 2026) రిపబ్లికన్ల ఆధ్వర్యంలోని ఫ్లోరిడా శాసనసభ ఆమోదముద్ర వేసింది. గతంలో ట్రంప్‌కు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ ఈ బిల్లుపై త్వరలోనే సంతకం చేయనున్నారు. ఈ విమానాశ్రయం ట్రంప్ నివాసమైన మార్-ఎ-లాగోకు కేవలం కొద్ది నిమిషాల దూరంలోనే ఉండటం విశేషం. అయితే, ఈ పేరు మార్పు ప్రక్రియ అధికారికంగా పూర్తి కావాలంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అనుమతి పొందాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా ‘ట్రంప్’ ముద్ర..
రియల్ ఎస్టేట్ దిగ్గజంగా ప్రపంచవ్యాప్తంగా తన భవనాలపై సొంత పేరును లిఖించుకున్న ట్రంప్, ఇప్పుడు దేశంలోని ప్రముఖ సంస్థలకు తన పేరును పెట్టడం ద్వారా ఒక అపూర్వమైన ముద్ర వేయాలని ఆకాంక్షిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. గతంలో కొన్ని సంస్థలకు ట్రంప్ పేరును పెట్టారు. వాషింగ్టన్‌లోని ప్రముఖ కళా కేంద్రం ‘కెన్నడీ సెంటర్’ పేరును గతేడాది డిసెంబర్‌లో ‘ట్రంప్-కెన్నడీ సెంటర్’గా మార్చారు. యూఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్‌కు కూడా ట్రంప్ పేరును జోడించారు. న్యూయార్క్‌లోని పెన్ స్టేషన్, వాషింగ్టన్‌లోని డల్లేస్ ఎయిర్‌పోర్ట్‌లకు కూడా తన పేరు పెట్టాలని ట్రంప్ ప్రయత్నించినప్పటికీ, అవి ఇంకా అమల్లోకి రాలేదని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.
కరెన్సీపై ట్రంప్ చిత్రం..?
మరోవైపు, ట్రంప్ ముఖచిత్రంతో కూడిన 1 డాలర్ స్మారక నాణెం ముసాయిదాను ట్రెజరీ విభాగం సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ వార్తలు వస్తున్నాయి. సాధారణంగా పదవిలో ఉన్న లేదా జీవించి ఉన్న అధ్యక్షుల బొమ్మలను కరెన్సీపై ముద్రించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, ఈ దిశగా అడుగులు పడటం చర్చనీయాంశంగా మారింది. కాగా, గురువారం జస్టిస్ డిపార్ట్‌మెంట్ ప్రధాన కార్యాలయంపై ట్రంప్ ముఖచిత్రంతో కూడిన భారీ నీలిరంగు బ్యానర్‌ను ప్రదర్శించడం అమెరికా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.






