- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం: బస్సును ఈడ్చుకెళ్లిన గూడ్స్ రైలు, 8 మంది మృతి
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే క్రాసింగ్ వద్ద ఉన్న ఒక పబ్లిక్ బస్సును గూడ్స్ రైలు ఢీకొట్టిన ఘటనలో కనీసం 8 మంది మృతి చెందగా, 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే క్రాసింగ్ వద్ద ఉన్న ఒక పబ్లిక్ బస్సును గూడ్స్ రైలు ఢీకొట్టిన ఘటనలో కనీసం 8 మంది మృతి చెందగా, 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సైతం నెట్టింట వైరల్‌గా మారింది. అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. ఎయిర్‌పోర్ట్ రైల్ లింక్ స్టేషన్ సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:40 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. చాచోంగ్‌సావో ప్రావిన్స్ నుంచి బ్యాంకాక్ వస్తున్న గూడ్స్ రైలు.. క్రాసింగ్ వద్ద ట్రాఫిక్‌లో ఆగివున్న ఆరెంజ్ రంగు బస్సును ముందు భాగంలో బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి బస్సుతో పాటు సమీపంలోని కార్లు, బైక్‌లను రైలు ట్రాక్‌పై కొంత దూరం ఈడ్చుకెళ్లింది. అనంతరం బస్సులో భారీగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
రోడ్డుపై ఎగిరిపడ్డ వాహనదారులు!
ప్రమాద తీవ్రతకు పలువురు ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ఎగిరిపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. మృతదేహాలన్నీ కాలిపోయిన బస్సులోనే లభ్యమైనట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ సిరిపాంగ్ తెలిపారు. అయితే, ప్రమాద సమయంలో బస్సులో ఎంత మంది ఉన్నారనేది ఇంకా స్పష్టం కాలేదన్నారు.
పడని సేఫ్టీ బారియర్లు..
రైలు వస్తున్నట్లు సిగ్నల్ వినిపించినప్పటికీ, క్రాసింగ్ వద్ద సేఫ్టీ బారియర్లు కిందకు పడలేదని (గేట్లు మూయలేదని) కిట్టిపాంగ్ రక్షా అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు. బారియర్లు సరిగ్గా పనిచేయలేదన్న వార్తలపై థాయ్ ప్రధాని అనుతిన్ చార్న్‌విరాకుల్ విచారణకు ఆదేశించారు. తాజా ఘటనతో థాయ్‌లాండ్ రైల్వే వ్యవస్థ భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ ఏడాది జనవరిలో కూడా బ్యాంకాక్‌లో ప్యాసింజర్ రైలుపై నిర్మాణంలో ఉన్న క్రేన్ పడి 28 మంది మృతి చెందగా, 64 మంది గాయపడిన విషయం తెలిసిందే.






