నాడు విమర్శలు.. నేడు ప్రశంసలు.. యూకేపై ట్రంప్ యూటర్న్

by Naga Rani Yarlagadda |

ఆఫ్ఘనిస్థాన్ లో పోరాడిన బ్రిటన్ సైనికులు మహావీరులు.. యూకే సైన్యం ప్రపంచంలోనే అత్యుత్తమం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు.

నాడు విమర్శలు.. నేడు ప్రశంసలు.. యూకేపై ట్రంప్ యూటర్న్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్థాన్ లో పోరాడిన బ్రిటన్ సైనికులు మహావీరులు.. యూకే సైన్యం ప్రపంచంలోనే అత్యుత్తమం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ యుద్ధంలో పాల్గొన్న యూకే సైనికులను డొనాల్డ్ ట్రంప్ “ప్రపంచంలోనే గొప్ప యోధులు”గా అభివర్ణించారు. నాటో సైనికులు ముందుబాటులో పాల్గొనలేదంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ సోషల్ మీడియా వేదికగా బ్రిటన్ సైనికుల ధైర్యాన్ని కొనియాడారు.

“యూకేకు చెందిన గొప్ప, ధైర్యవంతులైన సైనికులు ఎప్పటికీ అమెరికాతోనే ఉంటారు. ఆఫ్ఘనిస్థాన్లో 457 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రపంచంలోనే అత్యుత్తమ యోధుల్లో ఒకరు. ఈ బంధం ఎప్పటికీ తెగదు. యూకే సైన్యం హృదయంతో, ఆత్మతో పోరాడింది. అమెరికా తప్ప ప్రపంచంలో ఎవ్వరూ వారికి సమానులు కారు” అంటూ ట్రంప్ ప్రశంసలు కురిపించారు.

నాటోపై వ్యాఖ్యలతో దుమారం

ఇటీవల ట్రంప్ నాటో దేశాలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆఫ్ఘనిస్థాన్ యుద్ధ సమయంలో నాటో మిత్ర దేశాల సైనికులు ముందు వరుసలో ఉండకుండా కొంత దూరంగా ఉన్నారని, అమెరికా సైన్యమే ముందున్నదని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై బ్రిటన్ సహా పలు యూరోపియన్ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ శనివారం ట్రంప్‌తో నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. డౌనింగ్ స్ట్రీట్ విడుదల చేసిన ప్రకటనలో.. “ఆఫ్ఘనిస్థాన్లో పక్కపక్కనే పోరాడిన బ్రిటిష్, అమెరికన్ సైనికుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోవద్దని ప్రధాని స్పష్టం చేశారు. అనేక మంది తిరిగి స్వదేశానికి రాలేదని గుర్తుచేశారు” అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం నాలుగో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో రష్యా దాడులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ మద్దతు కొనసాగాల్సిన అవసరాన్ని కూడా స్టార్మర్ ప్రస్తావించినట్లు సమాచారం. తమ సైనికుల్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ట్రంప్ యూకే సైనికులపై ప్రశంసలు గుప్పిస్తూ పోస్టు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

ఇటలీ ప్రధాని ఘాటు విమర్శలు

ట్రంప్ వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా తీవ్రంగా స్పందించారు. నాటో మిత్ర దేశాలు వెనకబడ్డాయని ట్రంప్ వ్యాఖ్యలు అంగీకరించలేనివి అంటూ ఎక్స్ (X)లో పోస్టు చేశారు. దాదాపు 20 ఏళ్ల ఆఫ్ఘనిస్థాన్ యుద్ధంలో ఇటలీ 53 మంది సైనికులను కోల్పోయింది. 700 మందికి పైగా గాయపడ్డారు. నాటో దేశాల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడటం అనుచితమన్నారు. ముఖ్యంగా మిత్రదేశం అధ్యక్షుడు అలా మాట్లాడితే అసహ్యకరం అని మెలోని వ్యాఖ్యానించారు. నాటో దేశాల సైనికుల పాత్రపై ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు ఆయన బ్రిటన్ సైనికులను ప్రశంసిస్తుండగా, మరోవైపు గత వ్యాఖ్యలు మిత్రదేశాల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి.

Next Story