- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పశ్చిమాసియాలో రణరంగం: హోర్ముజ్‌లో నిలిచిపోయిన 37 భారత నౌకలు, చిక్కుకున్న 1,109 మంది దేశ ప్రజలు
ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడటంతో భారత్‌కు చెందిన 37 నౌకలు మధ్యలోనే చిక్కుకుపోయాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ షిప్పింగ్ రంగాన్ని కుదిపేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక చర్యల కారణంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వాణిజ్య మార్గం 'హోర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) మూతపడింది. దీంతో జలసంధికి ఇరువైపులా అనేక నౌకలు నిలిచిపోయాయి. ఇందులో భారత జెండాలున్న 37 నౌకలు, వాటిలో ఉన్న 1,109 మంది భారతీయ నావికులు చిక్కుకుపోయినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిలిచిపోయిన నౌకల్లో అధిక భాగం భారత్‌కు ముడి చమురు (Crude Oil), ఎల్‌ఎన్‌జీ (LNG)ని మోసుకొచ్చేవి కాగా, మరికొన్ని చమురు ఉత్పత్తుల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నవి.. ఇరాన్ ఈ జలసంధిని మూసివేయడంతో భారత ఇంధన అవసరాలకు కీలకమైన ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయినట్లు జాతీయ మీడియా (పీటీఐ) స్పష్టం చేసింది.
ముగ్గురు భారతీయ నావికుల మృతి!
ప్రస్తుత యుద్ధ వాతావరణం భారతీయ నావికుల ప్రాణాల మీదకు తెచ్చింది. విదేశీ జెండాతో ప్రయాణిస్తున్న నౌకలపై జరిగిన దాడుల్లో కనీసం ముగ్గురు భారతీయ నావికులు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలతో నావికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భారత నావికాదళం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ నావికుల రక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు..
అత్యవసర పరిస్థితుల్లో నావికులకు సాయం అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నావికుల కుటుంబాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. సముద్ర మార్గాల్లో ప్రయాణించే ఆపరేటర్లు ప్రస్తుత భద్రతా ముప్పులను (మిస్సైల్, డ్రోన్ దాడులు) అంచనా వేసుకుని అప్రమత్తంగా ఉండాలని 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్' సూచించింది. కాగా, గత శనివారం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఉధృతం చేశాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ తన మిత్రదేశాలతో కలిసి ఇజ్రాయెల్ లక్ష్యాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ప్రపంచ చమురు వ్యాపారంలో అధిక భాగం సాగే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపేలా ఉందని నిపుణులు చెబుతున్నారు.






