చిన్న డ్రాయింగ్ - భారీ చరిత్ర! సింహం బొమ్మకు రూ. 150 కోట్ల రికార్డు ధర

by Ramesh Naini |   (  Updated:2026-02-09 11:03:05  IST  )

ప్రఖ్యాత డచ్ చిత్రకారుడు రెంబ్రాండ్ (Rembrandt) గీసిన ఒక చిన్న సింహం చిత్రం అంతర్జాతీయ వేలంలో రికార్డు సృష్టించింది.

చిన్న డ్రాయింగ్ - భారీ చరిత్ర! సింహం బొమ్మకు రూ. 150 కోట్ల రికార్డు ధర
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రఖ్యాత డచ్ చిత్రకారుడు రెంబ్రాండ్ (Rembrandt) గీసిన ఒక చిన్న సింహం చిత్రం అంతర్జాతీయ వేలంలో రికార్డు సృష్టించింది. కేవలం చాక్ (సుద్ద)తో గీసిన ఈ చిత్రం న్యూయార్క్‌లో జరిగిన 'సోథబీస్' (Sotheby’s) వేలంలో ఏకంగా 18 మిలియన్ డాలర్లకు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 150 కోట్లు) అమ్ముడైంది. అయితే, ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం డబ్బును సింహాలు, పులుల వంటి 'బిగ్ క్యాట్స్' (Big Cats) సంరక్షణ కోసం ఉపయోగించనున్నారు.

రికార్డు బద్దలు కొట్టిన 'యంగ్ లయన్ రెస్టింగ్'

'యంగ్ లయన్ రెస్టింగ్' (Young Lion Resting) పేరుతో ఉన్న ఈ చిత్రం, రెంబ్రాండ్ గీసిన ఇతర డ్రాయింగ్స్ రికార్డులను తిరగరాసింది. గతంలో ఆయన గీసిన 'పోర్ట్రెయిట్ ఆఫ్ ఏ మ్యాన్ విత్ ఆర్మ్స్ అకింబో' అనే చిత్రం 3.7 మిలియన్ డాలర్లకు అమ్ముడవగా, ఇప్పుడు ఈ సింహం చిత్రం దానికి ఐదు రెట్ల అధిక ధర పలికింది. ఈ చిత్రాన్ని వేలానికి ఉంచిన ప్రముఖ అమెరికన్ బిలియనీర్ థామస్ కాప్లాన్, ఆయన సహచరుడు జాన్ అయర్స్.. ఈ వేలం ద్వారా వచ్చిన పూర్తి మొత్తాన్ని 'పాంథెరా' (Panthera) అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. పాంథెరా సంస్థ ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న 40 రకాల ‘బిగ్ క్యాట్స్’ జాతులను, అవి నివసించే అటవీ ప్రాంతాలను రక్షించడానికి కృషి చేస్తోంది. ఈ సందర్భంగా బిలియనీర్ కాప్లాన్ మాట్లాడుతూ.. ‘రెంబ్రాండ్ చిత్రాల కంటే నాకు వన్యప్రాణుల సంరక్షణపైనే ఎక్కువ మక్కువ. ఈ అద్భుతమైన చిత్రం ద్వారా వచ్చిన నిధులు, నిజమైన సింహాల సంరక్షణకు ఉపయోగపడటం కంటే గొప్ప విషయం మరొకటి లేదు’ అని చెప్పారు.

చిత్రం ప్రత్యేకతలు ఇవే..

రెంబ్రాండ్ తన 30 ఏళ్ల వయసులో అత్యున్నత సృజనాత్మక దశలో ఉన్నప్పుడు (ఆమ్స్టర్‌డామ్‌లో) ఈ చిత్రాన్ని గీశారు. కేవలం 4.5 అంగుళాల పొడవున్న ఈ చిత్రంలో సింహం విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. సింహం మెడలో ఒక పట్టీ (leash) ఉండటాన్ని బట్టి, రెంబ్రాండ్ దీన్ని ఏదైనా సంతలో లేదా ప్రదర్శనలో ఉన్న నిజమైన సింహాన్ని చూసి గీసి ఉంటారని సోథబీస్ సంస్థ అభిప్రాయపడింది. రెంబ్రాండ్ గీసిన సింహం చిత్రాలు ప్రపంచంలో కేవలం ఆరు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి కాగా, మిగిలినవి లండన్, పారిస్, ఆమ్స్టర్‌డామ్ మ్యూజియంలలో భద్రపరచబడి ఉన్నాయి.

Next Story