బీజేపీ చీఫ్ గా మహిళకు చాన్స్?

by Shamantha N |   (  Updated:2025-07-04 07:15:04  IST  )

భారతీయ జనతా పార్టీ తన తదుపరి జాతీయ అధ్యక్షురాలిగా ఒక మహిళను నియమించే అవకాశం కనిపిస్తోంది.

బీజేపీ చీఫ్ గా మహిళకు చాన్స్?
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ తన తదుపరి జాతీయ అధ్యక్షురాలిగా ఒక మహిళను నియమించే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ చీఫ్‌గా జేపీ నడ్డా పదవీకాలం జనవరి 2023లో ముగిసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో అధ్యక్షుడిని మార్చకుండా పార్టీ ఆయన పదవీకాలాన్ని జూన్ 2024 వరకు పొడిగించింది. అయితే కొత్త అధ్యక్ష నియామకంపై పార్టీ సీనియర్ నాయకులు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. అనేక మంది ప్రముఖ మహిళా రాజకీయ నాయకులను అత్యున్నత పదవికి పరిశీలిస్తున్నారు. నిర్మల సీతారామన్, డి.పురందేశ్వరి, వనతి శ్రీనివాసన్ లాంటి మహిళ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి.

రేసులో నిర్మల సీతారామన్

బీజేపీ అధ్యక్ష రేసులో ముందంజలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఉన్నారు. ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుత బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నిర్మల సీతారామన్ విస్తృత అనుభవం, నాయకత్వ సామర్థ్యం అధ్యక్ష పదవికీ అర్హురాలని అనుకుంటున్నారు. నిర్మల సీతారామన్ ను బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా నియమిస్తే దక్షిణ భారతదేశంలో బీజేపీ మరింత విస్తరించడానికి సహాయపడుతుందని ఆలోచన చేస్తున్నారు. లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదనతో పార్టీ సమన్వయాన్ని ఆమె నాయకత్వం ప్రతిబింబిస్తుందని అనుకుంటున్నారు. ప్రభుత్వంలో సీనియర్ నాయకురాలు, సీతారామన్ గతంలో రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు.

పురందేశ్వరీ పేరు పరిగణలోకి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షురాలు డి. పురందేశ్వరీ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ దేశాలకు వెళ్లి పాకిస్థాన్ చేసిన పహల్గాం దాడి, తర్వాత భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలు తెలిపిన ప్రతినిధి బృందాల్లో పురందేశ్వరీ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న పురందేశ్వరీ జాతీయ స్థాయి నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు కావడం కూడా ఆమెకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారడంతో పురందేశ్వరీ ఎంపికను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

న్యాయవాది వనతి శ్రీనివాసన్..

వనతి శ్రీనివాసన్ పేరును కూడా బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో వినిపిస్తోంది. ఈమెను కూడా ఈ పదవికి పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందని న్యాయవాది అయిన వనతి శ్రీనివాసన్ రాజకీయ నాయకురాలిగా బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి ఆమె పనిచేస్తున్నారు. 1993లో బీజేపీలో చేరినప్పటి నుంచి వనతి రాష్ట్ర కార్యదర్శి, జనరల్ సెక్రటరీ, తమిళనాడు ఉపాధ్యక్ష పదవితో సహా అనేక కీలక పదవులు నిర్వహించారు. 2020లో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2022లో ఆమె బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. ముఖ్యంగా ఆ పదవిలో పనిచేసిన మొదటి తమిళ మహిళగా గుర్తింపు పొందారు.

ఆర్ఎస్ఎస్ సూచనలతో మహిళ అధ్యక్షురాలి వైపు..

మహిళా నాయకత్వం ప్రతీకాత్మక, వ్యూహాత్మక ప్రయోజనాలను గుర్తించి, పార్టీ అత్యున్నత పదవికి మహిళను నియమించాలనే ఆలోచనను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆమోదించిందని వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో బీజేపీ విజయాల్లో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారు. దీంతో బీజేపీ మహిళ అధ్యక్షురాలి వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. ఒక వేళ బీజేపీ మహిళను జాతీయ అధ్యక్షురాలిగా నియమిస్తే మొదటి సారి మహిళకు చాన్స్ ఇచ్చినట్లవుతుంది.


Next Story