ఐఐటీ హైదరాబాద్‌లో వలస కూలీల ఆందోళన

by  |

దిశ, మెదక్: లాక్‌డౌన్ అమలులో ఉండటం, కాంట్రాక్టు సంస్థలు పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ శివారు కందిలోని ఐఐటీలో పనిచేస్తున్న వలస కూలీలు బుధవారం ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండు చేశారు. వారిని వారించడానికి వచ్చిన పోలీసులపై దాడికి దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. గురువారంలోగా పెండింగ్ జీతాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో కూలీలు శాంతించారు. సంగారెడ్డి జిల్లా కందిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ (ఐఐటీ) నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ దాదాపు 2400 మంది వలస కూలీలు పనిచేస్తున్నారు. గత నెల 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వీరంతా కందిలోనే చిక్కుకుపోయారు. అయితే, నిర్మాణ సంస్థలు మార్చి, ఏప్రిల్ నెలల జీతాలు కూలీలకు చెల్లించలేదు. గత నెల రోజులుగా ఎలాగో అలా కార్మికులు గడిపేశారు. అప్పటికీ నిర్మాణ సంస్థలు పట్టించుకోకపోవడం, ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందకపోవడంతో తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. విసిగిపోయిన కూలీలు బుధవారం ఐఐటీ దగ్గర ఆందోళనకు దిగారు. స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కోపోద్రిక్తులైన కార్మికులు రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పలు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఏఎస్‌ఐ సంగన్నకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కూలీలకు నచ్చజెప్పారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. వలస కూలీల ప్రతినిధులు ఐదుగురితో కలెక్టర్ హనుమంతరావు, స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంట్రాక్టు కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. గురువారంలోగా (రేపటిలోగా) పెండింగ్‌లో ఉన్న రెండు నెలల జీతాలు చెల్లించడానికి నిర్మాణ సంస్థలు అంగీకరించాయి. దీంతో కూలీలు శాంతించారు.

Tags: SP Chandrasekhar Reddy, MLA jaggareddy, Hanumantha rao, police, workers, conflict, companies, sangareddy

Next Story